సూపర్ స్టార్ రజినీకాంత్ సుదీర్ఘమైన ఆలోచన తర్వాత రాజకీయ పార్టీని పెట్టడానికి డిసైడ్ అయ్యారు. కరోనా కారణాలతో వెనక్కు తగ్గాలని అనుకున్న అభిమానుల నుండి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ఇక తప్పక రజినీ ముందడుగు వేశారు. ఈ తరుణం మిస్సైతే భవిష్యత్తులో అభిమానులు ఆదరిస్తారో లేదో అనే ఆందోళనతో రజినీ ఎన్నికల్లో పోటీచేయడానికి సిద్ధమయ్యారు. ఈ డిసెంబర్ 31న పార్టీ పేరును, ఇతర, ముఖ్య వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. అప్పుడే పార్టీ జెండాను, ఎన్నికల గుర్తును కూడ ప్రకటిస్తారట. ఎన్నికల్లో పోటీచేసే ఏ పార్టీకైనా ఎన్నికల గుర్తు చాలా కీలకం. గుర్తు ప్రజలను అమితంగా ఆకర్షించేలా ఉండాలి. గుర్తు చూడగానే పార్టీ అధ్యక్షుడు గుర్తుకు రావాలి. అందుకే రజినీ బృందం గుర్తును ఎంపిక చేసుకోవడం మీద కసరత్తు చేస్తున్నాయి.
తమిళ రాజకీయ వర్గాల సమాచారం మేరకు రజినీ సైకిల్ గుర్తు మీద ఎక్కువ ఆసక్తితో ఉన్నట్టు తెలుస్తోంది. దివంగత ఎన్టీఆర్ పార్టీ పెట్టే సమయంలో సామాన్యులకు చేరువయ్యేలా ఉండాలని సైకిల్ గుర్తును ఎన్నికల గుర్తులా ఎంచుకున్నారు. అది తెలుగుదేశమా పార్టీకి ఎంతగానో సహకరించింది. అతి తక్కువ సమయంలోనే సైకిల్ గుర్తు జనంలోకి వెళ్ళిపోయింది. అందుకు కారణం సైకిల్ అనేది ప్రతి సామాన్యుడికి చిరపరిచితమైన వస్తువు. కాబట్టే ఆ గుర్తు అంతలా పాపులర్ అయింది. రజినీ కూడా ఇప్పుడు ఏ గుర్తుకు ఎంచుకోనున్నారట. అయితే ఆ గుర్తు తెలుగుదేశం సైకిల్ గుర్తు కంటే భిన్నంగా ఉండనుంది. రజినీ సైకిల్ కు పాల క్యాన్ అదనపు ఆకర్షణగా ఉండనుంది.
ఈ ఎంపిక వెనుక పెద్ద కథే ఉంది. రజినీకాంత్ సినీ కెరీర్లో ‘అన్నామలై‘ పెద్ద హిట్. జనంలో ఆ సినిమాకు ఇప్పటికీ సూపర్ క్రేజ్ ఉంది. ఆ సినిమా పేరెత్తితే అందులో సైకిల్, దానికి తగిలించిన పాల క్యాన్లతో రజినీ కళ్ళ ముందు మెదులుతారు. ఒక వ్యక్తి సైకిల్ మీద పాలు అమ్ముకునే సామాన్యుడి స్థాయి నుండి పట్టుదలతో కృషి చేసి కోటీశ్వరుడిగా ఎదగడమే ఆ సినిమా సారాంశం. అందుకే సూపర్ స్టార్ ఆ పాల్ క్యాన్లు తగిలించిన స్కిల్ గుర్తు మీద ఎక్కువ మక్కువ చూపుతున్నారట. అలాగే పార్టీ జెండా కూడ మూడు ఆకర్షణీయమైన రంగుల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమాలన్నీ ఇంకొద్ది రోజుల్లో ముగియనున్నాయి. గుర్తును ఎంచుకోవడం ఒక ఎత్తైతే దాన్ని ఎన్నికల సంఘం ఎలాంటి గొడవలు, అభ్యంతరాలు లేకుండా ఆమోదించడం ఇంకొక ఎత్తు. మరి సైకిల్ గుర్తుతో ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించినట్టే రజినీ కూడ సృష్టించగలరేమో చూడాలి.