ఆంధ్రప్రదేశ్‌పై రాహుల్ ఫోకస్: కాంగ్రెస్ పుంజుకునేనా.?

తెలంగాణని నమ్ముకుని, సీమాంధ్రలో పార్టీని నాశనం చేసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పొందిన రాజకీయ లబ్ది ఏమీ లేదు. సీమాంధ్రలో మాత్రం కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కోల్పోయింది. ఇప్పుడు ఇన్నాళ్ళకు మళ్ళీ కాంగ్రెస్ అధిష్టానం, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టుంది. రాహుల్ గాంధీ రంగంలోకి దిగి, ఏపీకి చెందిన కాంగ్రెస్ నేతలతో మంతనాలు షురూ చేశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్రెసివ్‌గా రాజకీయాలు చేయాలని పార్టీ ముఖ్య నేతలకు రాహుల్ సూచించారట. ఎవరు.? కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో పెద్ద దిక్కు ఎవరు.? ఈ ప్రశ్నకైతే ప్రస్తుతానికి సమాధానం లేదు. పల్లం రాజు, చింతా మోహన్, శైలజానాథ్.. ఇలా పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీకి వున్నా, వీరిలో ఎవరూ ఓటర్లను ఆకర్షించగలిగే నాయకులు కారు.

మరెలా కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రంలో పుంజుకునేది.? ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో బోల్డంత క్యాడర్ వుండేది. అదంతా ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోయింది. సమీప భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తిరిగి ఏపీలో తన ఉనికిని చాటుకునే అవకాశమే లేదు. చిరంజీవితో కాంగ్రెస్ అధిష్టానం చర్చల కోసం ప్రయత్నిస్తున్నా, ఆయన అందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదట. పోనీ, ఏదన్నా పార్టీతో ఏపీలో పొత్తు పెట్టుకుందామనుకుంటున్నా, దానికీ ఎవరూ సహకరించడంలేదు. కాంగ్రెస్ పార్టీది స్వయంకృతాపరాధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో. ప్రత్యేక హోదా సహా చాలా విషయాల్లో చాలా మెలికలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. మెలికలని అనలేంగానీ, అసంపూర్తి వ్యవహారం చేపట్టి.. ఆంధ్రప్రదేశ్ దృష్టిలో దోషిగా మిగిలిపోయింది. ఈ పాప ప్రక్షాళన కాంగ్రెస్ పార్టీకి అంత తేలిక కాదు.