Rahul Gandhi Tweet : రాహుల్ గాంధీ ట్వీటు.. తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ హీటు.!

Rahul Gandhi Tweet : ఒక్క ట్వీట్ తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచేసింది. ఎందుకంటే ఆ ట్వీట్ వేసింది కాంగ్రెస్ యువ నేత, ఎంపీ రాహుల్ గాందీ వేశారు మరి. అదీ తెలుగులో.!

‘తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గు చేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభపెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి. తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది..’ ఇదీ రాహుల్ గాంధీ వేసిన ట్వీటు.

ఇంకేముంది అందరికన్నా ముందు తెలంగాణ రాష్ట్ర సమితి భుజాలు తడిమేసుకుంది. బీజేపీ సంగతి సరే సరి. వెరసి, తెలంగాణలో రాజకీయం ఒక్కసారిగా కనీ వినీ ఎరుగని స్థాయిలో హీటెక్కింది.

గత కొంతకాలంగా తెలంగాణలో వరి సాగు విషయమై పెద్దయెత్తున దుమారం చెలరేగుతోంది. కేంద్రమేమో కొర్రీలు పెట్టడం, రాష్ట్రమేమో కేంద్రం మీద పోరాటమని చెప్పడం.. వెరసి రైతులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటన్నారు. వాస్తవానికి చాలామంది రైతులు వరి పంటకు దూరమయ్యారు.

వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేసుకోవాలని సాక్షాత్తూ తెలంగాణ ప్రభుత్వమే చెబుతోందాయె. అయినా, రచ్చ ఆగడంలేదు. కేంద్రంపై పోరాటమంటూ తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు రకరకాల పబ్లిసిటీ స్టంట్లు చేశారు, చేస్తూనే వున్నారు. కేంద్రంపై పోరులో తెలంగాణ రాష్ట్ర సమితి సాధించింది సున్నా.

కాంగ్రెస్ మీద టీఆర్ఎస్, బీజేపీ కలిసి ఉమ్మడిగా ఎగబడుతున్నాయంటే.. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నట్టేనేమో.! ఒక్క ట్వీట్ తెలంగాణ రాజకీయాల్ని ఒక్కసారిగా మార్చేసిందని అనడం తప్పెలా అవుతుంది.?