ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చిన్న విరామం తర్వాత ఓ లేఖ రాశారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. ఈ లేఖ కూడా సెటైరికల్ కోణంలోనే వుందని అనుకోవాలా.? ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసేందుకు ఆయన సంధించిన లేఖగా దీన్ని భావించాలా.?ఏమో, భావించాల్సిందేనేమో. మేం అధికారంలోకి వస్తే, వృద్ధాప్య పెన్షన్లను 3 వేలకు పెంచుతాం..’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో నినదించిన మాట వాస్తవం. ‘ఒకేసారి కాదు.. పెంచుకుంటూ పోతాం..’ అని చెప్పామంటూ ఆ తర్వాత వివరణ ఇచ్చుకున్నారు వైఎస్ జగన్.
సరే, ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ పెంచుకుంటూ పోవాలి కదా.? 2,250 రూపాయల పెన్షన్ ఈపాటికే 2500 దాటాలి. కానీ, పెరగలేదు. కరోనా సహా అనేక సమస్యల కారణంగా పెంపు ఆలస్యమవుతోందని వైఎస్ జగన్ ప్రభుత్వం చెబుతోంది. కానీ, ఖచ్చితంగా పెంచుతామన్నది జగన్ ఇస్తున్న భరోసా. మొత్తంగా మూడు దఫాలుగా పెరగాలి గనుక.. 2,750 రూపాయలకు పెన్షన్ పెంచేసి ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి, వైఎస్సార్సీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు లేఖ ద్వారా.
రఘురామ ప్రస్తుతం వైసీపీలో లేరు. అలాగని ఆయన్ని పార్టీ సస్పెండ్ చేయలేదు. రఘురామ కూడా పార్టీకి రాజీనామా చేయలేదు. వైసీపీకీ, రఘురామకీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. కాదు కాదు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికీ.. రఘురామకృష్ణరాజుకీ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో రఘురామ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అవాకులు చెవాకులు పేలడం, నోటి దురద నేపథ్యంలో రఘురామకు రాజద్రోహం కింద సన్మానం జరగడం తెలిసిన సంగతులే. బెయిల్ తెచ్చుకున్నాక కూడా జగన్‌ని ఇరకాటంలో పెట్టేందుకు రఘురామ తనవంతు ప్రయత్నాలు చేస్తూనేవున్నారు. అందులో భాగమే ఈ పెన్షన్ లేఖాస్త్రం కూడా.