రాజకీయం చాలా చాలా మారిపోయింది. రాజకీయాల్లో రాణించాలంటే, కేసుల ప్రభావం ఎక్కువగా వుండాలన్న భావన రాజకీయ నాయకుల్లో పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తారు ప్రజాస్వామ్యవాదులు. అందుకు తగ్గట్టే, ఎక్కువ కేసులున్నవారికి మంచి మంచి పదవులు దక్కతున్నాయి.. ఆయా పార్టీలు అధికారంలో వున్నప్పుడు. తమ మీదున్న కేసుల నేపథ్యంలో, పార్టీలు ఫిరాయించే నాయకుల్నీ చూస్తున్నాం. ఇప్పుడీ చర్చ ఎందుకంటే, రఘురామకృష్ణరాజు అరెస్టు తర్వాత సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నోటి దురదకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్న విమర్శ ఓ పక్క వ్యక్తమవుతోంటే, ఇంకోపక్క.. రఘురామ తన పాపులారిటీని మరింత పెంచుకునే సమయం వచ్చిందనే చర్చ ఇంకోపక్క జరుగుతోంది.
సొంత నియోజకవర్గానికి వెళ్ళేందుకు ఇన్నాళ్ళూ మొహమాటపడిన రాజుగారు, ఇకపై అలాంటి సమస్యలు లేకుండా సింపతీ తెచ్చుకునేందుకు జనంలోకి వెళ్ళొచ్చన్నది కొందరు నెటిజన్ల అభిప్రాయం. అలా జరగాలంటే, ముందు ఆయనకు బెయిల్ రావాలి. రఘురామపై గట్టి సెక్షన్ల ప్రకారమే కేసులు పెట్టారు. దాంతో, బెయిల్ అంత సులభం కాదన్నది నిపుణుల వాదన. ఎంత గట్టి కేసులు పెట్టినా, ఎక్కువ కాలం రాజకీయ నాయకులు జైల్లో వుండడం అనేది ఈ రోజుల్లో సాధ్యమయ్యే పని కాదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద కూడా కేసుతున్నాయి. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇటీవల జైలుకి వెళ్ళి వచ్చారు.. ఆ తర్వాతే ఆయన్ని ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి వరించింది. మరి, రఘురామకి కూడా ఈ అరెస్టు పొలిటికల్ అడ్వాంటేజ్ అవుతుందా.? వ్యవస్థలు ఇలా తగలబడ్డాక.. ఎందుకు పెరగదు.? ఖచ్చితంగా పెరుగుతంది రఘురామ పాపులారిటీ.