వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సొంత నియోజకవర్గంలో పర్యటించి చాన్నాళ్ళే అయ్యింది. పంచాయితీ ఎన్నికలు జరిగాయి, మునిసిపల్ అలాగే కార్పొరేషన్ ఎన్నికలూ జరిగాయి. కానీ, నియోజకవర్గంలో ఏం జరుగుతోందో రఘురామకృష్ణరాజు స్వయంగా పరిశీలించింది లేదు. లోక్‌సభ సభ్యుడిగా తన సొంత నియోజకవర్గ సమస్యల గురించి ఆయన స్వయంగా తెలుసుకోవాలి.. ఇటు రాష్ట్ర ప్రభుత్వంపైనా, అటు కేంద్ర ప్రభుత్వంపైనా ఆయన ఒత్తిడి తీసుకొచ్చి, ‘పనులు’ చేయించుకోవాలి. కానీ, ఆయన అడపా దడపా ‘రచ్చబండ’ కార్యక్రమాలు పెడుతూ టైమ్ పాస్ చేస్తున్నారంతే. కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలుస్తారు.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలపై ఫిర్యాదులు చేస్తారు. తనకు రక్షణ కరవైందంటూ గగ్గోలు పెడతారు. అసలంటూ రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు అడుగు పెడితే, సొంత నియోజకవర్గానికి వెళితే ఆయనకు రక్షణ వుందో లేదో తెలుస్తుంది.
వైసీపీకి చెందిన పలువురు నేతలు చేసిన ఫిర్యాదులతో రఘురామకృష్ణరాజుకి వెన్నులో వణుకు మొదలైంది. తనను అరెస్టు చేస్తారేమోనన్న భయం ఆయనలో వుంది. ఆ భయంతోనే రఘురామ కోర్టుని కూడా ఆశ్రయించారు. తాజాగా తన భద్రత విషయమై, రాష్ట్రంలో పరిస్థితుల విషయమై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారట రఘురామకృష్ణరాజు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్రాలు చేస్తున్న అప్పులపై ఫిర్యాదు చేసేశారట. ఎంపీగా అది ఆయన హక్కు. కానీ, కేంద్రం ఎలా స్పందిస్తుంది.? అన్నదే కీలకం ఇక్కడ.
అమరావతి విషయంలో రఘురామ చాన్నాళ్ళుగా గగ్గోలు పెడుతున్నారు.. కానీ, ఆయన కోరుకున్నట్టుగా కేంద్రం కలగజేసుకుందా.? అంటే అదీ లేదు. ఢిల్లీలో ఓ చెట్టుకింద కూర్చుని నీతులు చెబుతారు.. సెటైర్లేస్తారు. కానీ, రాష్ట్రానికి రారు. సొంత నియోజకవర్గానికి అసలే వెళ్ళరు. అయినా, నియోజకవర్గంలో ప్రజల సమస్యల గురించి తెలుసుకోని వ్యక్తి నాయకుడెలా అవుతాడు.? ప్రజా ప్రతినిథిగా వుండడానికి అర్హుడెలా అవుతాడు.? ఢిల్లీలో మీడియా ముందు పులి.. అదే గల్లీలోకి వస్తే పిల్లి.. అన్నట్టు తయారైంది రఘురామకృష్ణరాజు పరిస్థితి.. అంటూ సొంత నియోజకవర్గ ప్రజలే చర్చించుకుంటున్నారట నర్సాపురంలో.