విజయసాయిరెడ్డి ట్వీటులోని మర్మమేంటి.?

వైసీపీ ఎంపీ (రాజ్యసభ), ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి, తాజాగా ఓ ట్వీటేశారు. అందులో ’వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ‘లోని ’ఆర్‘ గురించి పేర్కొంటూ, దాన్ని ’రైతు‘ అని వివరించారు. నిజమే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. కానీ, వైసీపీలో చాలామందికి ఈ విషయం తెలియదేమో. వైసీపీకి ఓట్లేసిన చాలామందికి కూడా ఈ విషయం తెలియదు.

పదే పదే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాత్రం పదే పదే ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’ అంటూ వైసీపీ నేతలకు, పార్టీ పేరుని సవివరంగా గుర్తు చేస్తుంటారు. అది వేరే వ్యవహారం. ఇక్కడ, విజయసాయిరెడ్డి ట్వీటు గురించిన ఇంత చర్చ దేనికంటే.. అందులో ఆయన ‘రైతు భరోసా’ కార్యక్రమం గురించి పేర్కొన్నారు.

‘వైఎస్సార్ రైతు భరోసా – పీఎం కిసాన్’ పథకాల ద్వారా లబ్దిదారులైన రైతుల ఖాతాల్లోకి నేరుగా సొమ్ములు వేయడం ఈ పథకం తాలూకు ముఖ్య ఉద్దేశ్యం. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం.. రెండూ కలిసి ఈ మొత్తాల్ని రైతుల ఖతాలో వేస్తున్నాయి. కేంద్రం ఇచ్చేది కాకుండా, రాష్ట్ర ప్రభుత్వం 12 వేలు ఇవ్వాలన్న డిమాండ్ వుందనుకోండి.. అది వేరే సంగతి.

‘పీఎం కిసాన్’ అనే పేరు వున్నాగానీ, ప్రచారార్భాటంలో భాగంగా ‘వైఎస్సార్ రైతు భరోసా’ పేరే పెద్దదిగా కనిపిస్తుంటుంది. కానీ, సవివరంగా విజయసాయిరెడ్డి, తమ ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారాన్ని తప్పు పడుతూ.. అసలు విషయాన్ని వెల్లడించేశారు. ఇక్కడ ‘తప్పు పడుతూ’ అనేది ఆయన నేరుగా చేయలేదు.

ఈ ట్వీటుని ప్రస్తావిస్తున్న నెటిజన్లు, వైసీపీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పబోతున్నారు.. బీజేపీలో చేరతారంటూ కామెంట్లేస్తున్నారు. మొన్నీమధ్యనే సినీ నటుడు తారక రత్న మృతి చెందిన దరిమిలా, ఆ కార్యక్రమాల్లో చంద్రబాబుతో కలిసి కనిపించారు విజయసాయిరెడ్డి. అలా ఆయన టీడీపీలోకి వెళ్ళిపోవచ్చని కూడా ఊహాగానాల్ని ప్రచారం చేస్తున్నారు. ఇదెక్కడి గోల.? అసలు ఈ గాలి వార్తలకు విజయసాయిరెడ్డి ఎందుకు ఆస్కారం కల్పిస్తున్నట్టు.?