హస్తినకు అనపర్తి ఘటన.. నేరం ఎవరిది?

గత రెండు రోజులుగా ఏపీలో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి అంశమే హాట్ టాపిక్ గా ఉంది! చంద్రబాబు – పోలీసుల మధ్య జరిగిన వాగ్వాదం, బాబు పాదయాత్ర, సభాస్థలి సమస్య… ఇలా అన్ని అంశాలపైనా చర్చ జరుగుతుంది. అయితే… ఈ మొత్తం వ్యవహారంలో ఎవరిది తప్పు.. ఎవరిది కరెక్ట్! ఎవరిది పంతం – ఎవరిది పద్ధతి – మరెవరిది మూర్ఖత్వం – ఇంకెవరిది కక్షసాధింపు అన్నది ఇప్పుడు చూద్దాం!

తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. అనపర్తిలో సభ పెట్టాలని నిర్ణయించుకున్నారు! అయితే రోడ్లు ఇరుకుగా ఉన్నాయి.. చిన్న చిన్న రోడ్లు.. ఫలితంగా సభ పెడితే ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు అని తెలిపిన పోలీసులు.. గర్ల్స్ హైస్కూల్ ఎదుట ఉన్న ఖాళీ స్థలం లేదా స్థానికంగా ఉన్న కళాక్షేత్ర ప్రాంగణంలో పెట్టూకోవమని సూచించారు. ఇది పోలీసుల నుంచి బాబుకు వచ్చిన సూచన!

తాను మాత్రం నాలుగు రోడ్ల జంక్షన్ లో మాత్రమే సభ పెట్టుకుంటామని పట్టుపట్టారు చంద్రబాబు. కొన్ని రోజుల క్రితం కందుకూరులో ఇరుకురోడ్డులో సభ పెట్టడం, తొక్కిసలాటలో 8 మంది మరణించడం తెలిసిందే. అది దృష్టిలో పెట్టుకున్న పోలీసులు, మరోసారి అలాంటి ఘటన జరగకూడదని భావించారు. కానీ.. చంద్రబాబు మాత్రం తాను అనుకున్నదే జరగాలని భీష్మించుకుని కుర్చున్నారు! ఇదన్నమాట జరిగింది!!

అయితే… ఈ వ్యవహారంపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబుని అడుగడుగునా పోలీసులు అడ్డుకున్నారని.. అందుకే ఆయన చీకట్లోనే నడచి సభాస్థలికి రావల్సి వచ్చిందని.. ఆయనకు ప్రాణాపాయం కూడా ఉందంటూ ఎంపీ ఆర్.ఆర్.ఆర్. రాసిన లేఖలో పేర్కొన్నారు!

మరి ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని.. పోలీసులదే తప్పు అని భావించి రాష్ట్ర ప్రభుత్వానికి చివాట్లు పెడుతుందా.. లేక, చంద్రబాబుదే మూర్ఖత్వం అని లైట్ తీసుకుంటుందా అన్నది వేచి చూడాలి!