శాసన మండలి రద్దుపై రఘురామ కొత్త రాజకీయం

శాసన మండలి రద్దుపై కేంద్ర న్యాయ శాఖ మంత్రిని కలుస్తానంటున్నారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. అదేనండీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. కలవమనండి, ఎవరు వద్దన్నారు.? ఇన్నాళ్ళూ ఆయన్ని కేంద్ర మంత్రి మంత్రి వద్దకు వెళ్ళకుండా ఎవరు అడ్డుకున్నారు.?

శాసన మండలి రద్దుపై వైఎస్ జగన్ సర్కార్ గతంలోనే నిర్ణయం తీసుకుంది. శాసన సభలో ఈ మేరకు తీర్మానం చేసి, కేంద్రానికి పంపింది వైఎస్ జగన్ ప్రభుత్వం. కేంద్రం మాత్రం ఇంతవరకు శాసన మండలి రద్దుపై నిర్ణయం తీసుకోలేదు. అయితే, శాసన మండలి రద్దుకి తీర్మానం చేశాక కూడా.. శాసన మండలి కోసం తమ పార్టీకి చెందిన నేతలకు వైఎస్ జగన్ ఎందుకు హామీలు ఇస్తున్నారన్నది వేరే చర్చ.

కేంద్రం, శాసన మండలి రద్దుకి అంత సానుకూలంగా లేదు. ఒకసారి రద్దయితే, మళ్ళీ శాసన మండలి ఏర్పాటుకి పెద్ద తతంగమే అవుతుంది. ఈ కారణంగా వైఎస్ జగన్ సర్కారు కూడా శాసన మండలి రద్దు విషయమై పునరాలోచనలో పడినట్లే తెలుస్తోంది.

గత కొంతకాలంగా వైసీపీ మీద ఏదో ఒక రకంగా విమర్శలు చేయడం ద్వారా పాపులారిటీ పెంచుకోవాలని తహతహలాడుతున్న రఘురామకృష్ణ రాజు పనిగట్టుకుని ఇదిగో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు.. ఇప్పుడిలా శాసన మండలి వ్యవహారాన్ని సందర్భం కాకపోయినా తెరపైకి తెచ్చారు.

కేంద్రం దగ్గర తనకు చాలా పరపతి వుందని చెప్పుకోవడం రఘురామ అసలు ఉద్దేశ్యం. కానీ, పాపం ఆయన ఆశించిన స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పెద్దల నుంచి స్పందన ఆయా విషయాల్లో రావడంలేదాయె. అమరావతి విషయంలో కావొచ్చు, మరో విషయంలో కావొచ్చు.. రాష్ట్ర ప్రభుత్వంపైనా రాష్ట్రంలోని అధికార పార్టీపైనా పలుసార్లు పలువురు కేంద్ర మంత్రులకు ఫిర్యాదులు చేశారు రఘురామ.

పట్టువదలని విక్రమార్కుడిలా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ చేస్తున్న ఈ ప్రయత్నాలు ఇంకో రెండేళ్ళు ఇలాగే కొనసాగుతాయ్. తనను గెలిపించిన నర్సాపురం నియోజకవర్గ ప్రజల మొహం చూడటానికి ఇష్టపడరుగానీ.. మీడియా ముందుకొచ్చి రచ్చబండ పేరుతో లెక్చర్లు దంచేస్తుంటారు. దటీజ్ రఘురామ రాజకీయం.