Raghu Rama Krishnam Raju : బస్తీమే సవాల్.. నా మీద అనర్హత వేటు వేసే దమ్ముందా.? ఇంకో ఛాన్సిస్తున్నా.. మీకు చేత కాకపోతే చెప్పండి నేనే రాజీనామా చేసి పారేస్తా..’ అంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణ రాజు సవాల్ విసురుతున్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామ, ఆ తర్వాత సొంత పార్టీకి పక్కలో బళ్లెంలా తయారయ్యారు.
ఆయన్ని బయటికి పంపేంత చేవ వైసీపీ అధిష్టానానికి లేకుండా పోయింది. దాంతో రఘురామ చెలరేగిపోతూనే ఉన్నారు. పార్టీ కనుక ఆయన్నిబహిష్కరిస్తే, ఎంపీ పదవికి ఇబ్బంది లేకుండా రఘురామ ఏదో ఒక పార్టీలోకి దూకేయొచ్చు. అదే రఘురామ ఏదైనా పార్టీలోకి దూకితే, వైసీపీ ఆయన మీద అనర్హత వేటు కోసం మరింత గట్టిగా ప్రయత్నించొచ్చు. అందుకే ఈ హైడ్రామా నడుస్తోంది.
తనను వైసీపీ నుంచి ఎవరూ బహిష్కరించలేరని రఘురామకు తెలుసు. అదే సమయంలో ఆయన మీద అనర్హత వేటు వేయించలేమని వైసీపీకి కూడా తెలుసు. అందుకే, ఇరువురూ వ్యూహాత్మక చేతకానితనాన్ని ప్రదర్శిస్తున్నారు. వైసీపీతో తనకు పొసగదని అనుకున్నారు, కనుక వైసీపీ నుంచి రఘురామ బయటికి వెళ్లిపోవాలి. కానీ, వెళ్లారాయన.
తాజాగా రఘురామ ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటున్నారు. ఉప ఎన్నికలకు వెళ్తానంటున్నారు. వైసీపీని ఓడిస్తానంటున్నారు. రాష్ర్టానికి పట్టిన దరిద్రాన్ని వదిలిస్తానంటున్నారు. సాధ్యమయ్యే పనేనా.? ఇది. ఇంకో ఏడాది సాగదీయగలిగితే, రఘురామ రాజీనామా చేసినా ఉప ఎన్నిక రాకపోవచ్చు. గతంలో ప్రత్యేక హోదా పేరుతో, వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడు ఇదే డ్రామా నడిచింది.