Kodi Kathi : కోడి కత్తి లాభంలో రఘురామకృష్ణరాజుకి వాటా లేదా.?

Kodi Kathi : సోషల్ మీడియా వేదికగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుకీ, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (రాజ్యసభ)కీ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం నడుస్తోంది. ట్వీట్లు పోటెత్తుతున్నాయ్. సెటైర్లతో ఇరువురు నేతలూ నవ్వులపాలైపోతున్నారు కూడా.!

తాజా ఎపిసోడ్ కోడి పందాలు – కోడి కత్తి గురించి కావడం గమనార్హమిక్కడ. ‘కోడి పందాలు మా సంస్కృతి అంటూ సుప్రీం కోర్టు వరకూ వెళ్ళాడు. అందరూ అతన్ని పందెం కోడి అనుకున్నారు. కానీ, అతను ఫారం కోడి అని తేలిపోయింది. టీడీపీ ట్యూన్లకు రికార్డింగ్ డాన్స్ వేసే డాన్సింగ్ రాజా అతను. ఆ నర్సాపురం పంజరం చిలక ఢిల్లీలో కూర్చుని పలికేవన్నీ పచ్చ గ్యాంగ్ రాసిచ్చిన పలుకులే’ అని విజయసాయిరెడ్డి ట్వీటేశారు.

ఇంకేముంది, ‘కోడి’ అన్న హింట్ విజయసాయిరెడ్డి ఇచ్చేశాక, దాని మీద రఘురామ తనదైన స్టయిల్లో సెటైర్ల కథ అల్లకుండా వుంటారా.? ‘కోడి కత్తిని అడ్డం పెట్టుకుని వచ్చిన మీరు ఇంతకన్నా ఏమంటారులే. ఎలాగో నీకు రాజ్యసభ రెన్యువల్ లేదు కాబట్టి నువ్వు నా మీదకు పందెం కోడిగా రా. నీ ఈకలు పీకి పంపేస్తా! అవునుకానీ, నువ్వు ఏ1 ట్యూన్స్‌కి డాన్స్ చేస్తున్నావా లేక విశాఖలో ఇంకెవరైనా కడుతున్న ట్యూన్స్‌కి డాన్స్ చేస్తున్నావా?’ అంటూ రిటార్ట్ ఇచ్చేశారు రఘురామకృష్ణరాజు.

సెటైర్ అదిరింది.. రిటార్ట్ అంతకన్నా అదిరింది. కానీ, రఘురామ మీద కేసులున్న సంగతి తెలిసే కదా, వైసీపీ అధినాయకత్వం ఆయన్ను వైసీపీలోకి రప్పించి, టిక్కెట్టు ఇచ్చింది.! అంతేనా, కోడి కత్తి ఘటనతో వైసీపీకి రాజకీయ లబ్ది కలిగిందే నిజమైతే, అందులో రఘురామకీ ఖచ్చితంగా వాటా వున్నట్టే లెక్క.

అటు విజయసాయిరెడ్డి, ఇటు రఘురామ.. ఇద్దరూ కలిసి వైసీపీ పరువుని బజార్న పడేస్తున్నారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?