తెలంగాణను రెండు పార్టులుగా విడదీస్తే.. తెలంగాణ రావడానికి ముందు.. తెలంగాణ వచ్చాక అని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాకముందు బతుకమ్మ, బోనాలు లాంటి పండుగలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించలేదు. కానీ.. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వమే అధికారికంగా బతుకమ్మ, బోనాలు, దసరా ఉత్సవాలను నిర్వహిస్తోంది.
అలాగే ప్రతి సంవత్సరం బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం ఉచితంగా బతుకమ్మ చీరలను అందిస్తోంది. ప్రతి ఏటా ప్రభుత్వం ఇస్తున్న కానుక. తెలంగాణ ఆడపడుచులకు అందించే బతుకమ్మ చీరలను ప్రతి సంవత్సరం సిరిసిల్లలో తయారు చేయిస్తోంది ప్రభుత్వం.
ఇక.. ఈ సంవత్సరం బతుకమ్మ పండుగ కూడా సమీపిస్తుండటంతో తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీపై దృష్టి పెట్టింది.
అయితే.. ఇన్ని రోజులు పంపిణీ చేసిన బతుకమ్మ చీరలు ఒక ఎత్తు అయితే.. ఈ సారి పంపిణీ చేయబోయే బతుకమ్మ చీరలు మరో ఎత్తు. ఎందుకంటే.. ఈ సారి పంపిణీ చేసే బతుకమ్మ చీరలు సాదాసీదావి కావు. మంచి క్వాలిటీ ఉన్న చీరలు. ఈ సారి బంగారం, వెండి రంగుల జరీలను కలిపి నేసిన చీరలు అవి. ఆషామాషీగా చీరలు నేయడం కాదు.. చీరల క్వాలిటీ అద్భుతంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
దీంతో చీరల క్వాలిటీపై ఎప్పటికప్పుడు మంత్రి కేటీఆర్ సిరిసిల్ల నేతన్నలను సూచనలు చేస్తున్నారు. మొత్తం కోటి చీరలను ఈ సారి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతుండగా… ఇప్పటికే 85 లక్షల చీరలను నేతన్నలు సిద్ధం చేశారు. మిగిలిన 15 లక్షల చీరలు కూడా త్వరలోనే పూర్తి అవుతాయి. అవి పూర్తి కాగానే.. బతుకమ్మ చీరలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది.
మొత్తం 220 వెరైటీలు
బంగారం, వెండి రంగుల జరీలతో పాటుగా మొత్తం 220 వెరైటీలతో ఈసారి బతుకమ్మ చీరలను తయారు చేయిస్తున్నారు. 220 వెరైటీలలో 10 గజాల చీరలు 10 లక్షలు ఉన్నాయి. మిగిలిన చీరలు 5.5 మీటర్లు, 85 సెంమీ జాకెట్ వస్త్రంతో పాటు రానున్నాయి.
ఈ నెల చివరి నాటికి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆడపడుచులకు బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేయడానికి సంసిద్ధమవుతోంది. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, 18 ఏళ్లు నిండిన ప్రతి తెలంగాణ ఆడపడుచుకు బతుకమ్మ చీరను ప్రభుత్వం కానుకగా ఇవ్వనుంది.