నానా రకాల దుర్భాషలూ ఆడారు కేసీయార్ ఆంధ్రోళ్ళను ఉద్దేశించి. ‘అదేదో, తెలంగాణ ఉద్యమ వేడిలో అనేశారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఎవర్నీ ఏమీ అనలేదు కదా..’ అంటూ, తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ‘లంకలో పుట్టినోళ్ళంతా రాక్షసులే.. సీమాంధ్రలో పుట్టినోళ్ళంతా తెలంగాణ ద్రోహులే..’ అని ఆయన నినదించిన సందర్భాలూ వున్నాయ్.
‘అబ్బే, మేం దోపిడీ దారుల గురించే అలా అన్నాం తప్ప.. సీమాంధ్రలో సాధారణ ప్రజానీకాన్ని ఉద్దేశించి కాదు..’ అని గులాబీ పార్టీ కవరింగ్ డైలాగులు పేల్చొచ్చుగాక. ఎలా, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసీయార్ రాజకీయం చేయగలుగుతారు.?
తెలుగుదేశం పార్టీ తిరిగి మునుపటిలా తెలంగాణలో రాజకీయం చేయాలనుకుంటే, అందుకు కేసీయార్ ఒప్పుకుంటారా.? వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. తన పార్టీని తెలంగాణలో మళ్ళీ విస్తరించాలనుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి అందుకు సానుకూలంగా స్పందిస్తుందా.?