3 రాజధనులకు మద్దతివ్వనున్న తెలంగాణ సీఎం కేసీయార్.?

జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తన రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిని జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన విషయం విదితమే. ఆంధ్రప్రదేశ్‌లో రెండు లేదా మూడు చోట్ల త్వరలో కేసీయార్ బహిరంగ సభల్ని నిర్వహించబోతున్నారు.. బీఆర్ఎస్ అధినేతగా.!

వీటిల్లో విజయవాడ పేరు ఇప్పటికే ఖరారు కాగా, ఇంకొకటి విశాఖ కాబోతోందని తెలుస్తోంది. విశాఖపట్నంలో బహిరంగ సభ కోసం తెరవెనుక కసరత్తులు జోరుగా సాగుతున్నాయి. ఉత్తరాంధ్రలో పలువురు టీడీపీ, వైసీపీ నేతలతో టీఆర్ఎస్ ముఖ్య నేతలు మంత్రాంగం నడుపుతున్నట్లు తెలుస్తోంది.

కర్నూటులో మజ్లిస్ సాయంతో భారీ బహిరంగ సభ నిర్వహించాలన్నది కేసీయార్ వ్యూహంగా కనిపిస్తోంది. కర్నూలు కాకపోతే, తిరుపతిని ఎంపిక చేయాలని అనుకుంటున్నారట. మొత్తంగా మూడు ప్రాంతాల్నీ కవర్ చేసేలా ‘బీఆర్ఎస్’ వ్యూహం వుండబోతోందిట.

ఇంతకీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల కాన్సెప్ట్ విషయమై కేసీయార్ ఆలోచనలు ఎలా వుండబోతున్నాయి.? రాష్ట్రంలో ఈ అంశం చుట్టూ పెద్ద రచ్చ జరుగుతున్న దరిమిలా, ‘దేశ్ కీ నేతా’ అంటే, తనదైన అభిప్రాయాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని లేదా రాజధానుల విషయమై కేసీయార్ కూడా చెప్పాల్సి వుంటుంది.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మూడు రాజధానుల కాన్సెప్ట్‌లో తప్పేమీ లేదనీ, అసలైతే ఓ రాజధాని ముందుగా వుండాలి కదా.? అన్న దిశగా కేసీయార్ తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టబోతున్నారని తెలుస్తోంది.

కేసీయార్ మహా మాటకారి. ఏ విషయమ్మీద అయినా తన వాదనను గట్టిగా చెప్పగలరు. అందుకే, పోలవరం సహా అనేక విషయాలపై కేసీయార్ ‘మారిన మనిషి’ తరహాలో ఏీపలో ప్రసంగించే అవకాశాలు వున్నాయట.