ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కృష్ణంరాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. నటుడిగా ఐదు దశాబ్దాల కాలం పాటు ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు ఏర్పరచుకున్న కృష్ణంరాజు హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని పొందాడు. అంతేకాకుండా కేంద్ర మంత్రిగా కూడా ప్రజలకు ఎన్నో సేవలు అందించాడు. అయితే చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు గారు ఇటీవల ఆరోగ్య పరిస్థితి విషమించటంతో తాజాగా ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందాడు.
కృష్ణంరాజు మరణం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు మిగిల్చింది. కృష్ణంరాజు మరణంతో ఆయన కుటుంబంలో మాత్రమే కాకుండా యావత్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. దీంతో కృష్ణంరాజు మృతి పట్ల సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు పలువురు వ్యాపారవేత్తలు కూడా సంతాపం తెలియజేస్తున్నారు . ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా కృష్ణంరాజు మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
జగన్మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కృష్ణంరాజు గారికి సంతాపం తెలియజేస్తూ..” కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటులు కృష్ణంరాజు గారి మరణం బాధాకరం. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన ప్రజలకు అందించిన సేవలు చిరస్మరణీయం. కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.” అని ట్విట్టర్ లో పోస్ట్ షేర్ చేశారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలియజేశాడు. కృష్ణంరాజు అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.