టీడీపీ వర్సెస్ వైసీపీ: పులిచింతల ఎవరి ఘనత.?

పులిచింతల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయింది. ఆ గేటు దొరికింది కూడా. అయితే, తిరిగి గేటుని ఏర్పాటు చేయడం బోల్డంత కష్టంతో కూడుకున్న పని. ప్రస్తుతానికైతే స్టాప్ లాక్ ఏర్పాటుతో గేటు మూసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత ప్రాజెక్టులో నీటి నిల్వ పెరుగుతుంది. కానీ, ఎగువ నుంచి నీటి రాక నిలిచిపోయింది. దాంతో, పులిచింతల ప్రాజెక్టులో నీటి లభ్యతపై ఆందోళన వ్యక్తమవుతోంది. అసలు పులిచింతల ప్రాజెక్టుకి బీజం పడిందెప్పుడు.? అంటే, స్వర్గీయ ఎన్టీయార్ హయాంలో ఈ ప్రాజెక్టుకి బీజం వేశారు. చంద్రబాబు హయాంలో టెండర్లు ఖరారయ్యాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రాజెక్టు జాతికి అంకితం చేయబడింది. చంద్రబాబు హయాంలోనే ప్రాజెక్టు పూర్తయ్యింది.

ఇదీ పులిచింతల ప్రాజెక్టు చరిత్ర. గేట్లు చంద్రబాబు హయాంలో ఏర్పాటయ్యాయనీ, అవకతవకలు అక్కడే జరిగాయనీ వైసీపీ అంటోంది. కాదు కాదు, వైఎస్సార్ అవినీతి ధన యజ్ఞం కారణంగానే ప్రాజెక్టుకి ఈ దుస్థితి.. అన్నది టీడీపీ వాదన. ఎవరి గోల వారిదే. నిజానికి, ఇప్పుడు జరగాల్సింది డ్యామేజీ కంట్రోల్. అదే సమయంలో, నష్టానికి ఎవరు కారణం అన్నది విచారణ చేసి నిజాలు నిగ్గు తేల్చాలి. బాధ్యులకు కఠిన శిక్ష విధించాలి. కానీ, అది సాధ్యమయ్యే పనేనా.? కోట్లు వెచ్చించి కొత్త గేట్ల దిశగా జగన్ సర్కారు సన్నాహాలు చేస్తోందట. హైడ్రాలిక్ విధానంలో గేట్లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇంతకీ, పులిచింతల ప్రాజెక్టు నాణ్యత మాటేమిటి.? ఇది మాత్రం ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే. కానీ, ప్రాజెక్టు క్రెడిట్ కోసం టీడీపీ – వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఎవరైతే క్రెడిట్ దక్కించుకుంటారో, వారే.. వైఫల్యాలకీ బాధ్యత వహించాల్సి వుంటుంది.