పులిచింతల రాజకీయం.. టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఎవరు రైటు? ఎవరు రాంగ్.?

ప్రమాదవశాత్తూ పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించిన ఓ గేటు కొట్టుకుపోయింది. ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు ఉపక్రమించి, తక్కువ సమయంలోనే స్టాప్ లాక్ ఏర్పాటు చేయగలిగింది. అయితే, పులిచింతల డ్యాం నుంచి పెద్ద మొత్తంలో నీటిని కిందికి వృధాగా వదిలేయాల్సి వచ్చింది. మొత్తంగా డ్యాం ఖాళీ చెయ్యాల్సిన పరిస్థితి వచ్చిందన్నది నిర్వివాదాంశం. అదృష్టవశాత్తూ మళ్ళీ ఎగువ నుంచి నీటి ప్రవాహం పెరుగుతోంది. దాంతో, పులిచింతల డ్యాం మళ్ళీ పూర్తిస్థాయిలో నిండిపోవడానికి ఆస్కారమేర్పడుతోంది. నిజానికి, ఇలాంటి విషయాల్లో రాజకీయాలు అంత మంచిది కాదు. కానీ, రాజకీయ పార్టీలు రాజకీయాలే చేస్తాయి. పులిచింతల డ్యాం వైఎస్ హయాంలో నిర్మితమైన మాట వాస్తవం. ఈ క్రమంలో పెద్దయెత్తున అవకతవకలు జరిగాయనీ, అక్రమాలు రాజ్యమేలాయనీ, దాంతో డ్యాం పనులు నాసిరకంగా జరిగాయనీ, అందుకే డ్యాం గేట్ కొట్టుకుపోయిందనీ టీడీపీ ఆరోపిస్తోంది.

అయితే, 2015లో.. అంటే, చంద్రబాబు అధికారంలో వున్నప్పుడే, డ్యాంకి సంబంధించి ఓ నివేదిక వచ్చింది. అందులో, డ్యాం పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యల గురించి పేర్కొన్నారు. కానీ, ఆ నివేదికను చంద్రబాబు ప్రభుత్వం తొక్కిపెట్టిందన్న ఆరోపణలున్నాయి. ఇది అధికార వైసీపీకి ఆయుధంగా మారింది. సరే, టీడీపీ ఆ నివేదికను తొక్కిపెట్టిందే అనుకుందాం. గడచిన రెండేళ్ళలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఏం చేసినట్లు.? అన్న ప్రశ్న తెరపైకొస్తుంది. ప్రస్తుతం అధికారంలో వున్నది వైసీపీనే. కాబట్టి, డ్యాం గేటు కొట్టుకుపోవడానికి ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాల్సి వుంటుంది. ఇదిలా వుంటే, డ్యాం వ్యవహారాలపై తెలంగాణ అస్సలు పట్టించుకోవడంలేదు. ఎందుకంటే, డ్యాం ద్వారా విద్యుదుత్పత్తి ఒక్కటే తెలంగాణ బాధ్యత, అవసరం. గేట్ల నిర్వహణతో తమకు సంబంధం లేదని తేల్చేసింది.