భారత అత్యున్నత న్యాయస్థానం 48వ ప్రధాన న్యాయమూర్తిగా తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు. దీంతో తెలుగు నేల పులకిస్తోంది. 55 ఏళ్ల క్రితం.. 1966లో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా తెలుగు వ్యక్తి జస్టిస్ కోకా సుబ్బారావు ఎంపికయ్యారు. ఆయన తర్వాత సుప్రీం అత్యున్నత పీఠాన్ని అధిష్టించింది జస్టిస్ ఎన్వీ రమణ మాత్రమే. దీంతో తెలుగు ప్రజలు సంతోషిస్తున్నారు. అయితే.. రాజకీయ శక్తుల ముసుగులో పరోక్షంగా కొందరు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారి తీస్తోంది.
ఆమధ్య జస్టిస్ ఎన్వీ రమణపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాజీ సీజేఐ జస్టిస్ బోబ్డేకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని తీసుకుని సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ట్రోల్స్, మీమ్స్ జస్టిస్ రమణను ఇబ్బంది పెట్టేలా ఉన్నాయనే చెప్పాలి. జగన్ పని అయిపోయింది.. మోదీ ఇక ఇంటికే.. అంటూ జస్టిస్ రమణను ఉద్దేశిస్తూ ఒక వర్గం ఆయన్ను సొంతం చేసుకుంటున్న తీరు సరైంది కాదనే చెప్పాలి. ఒక తెలుగు వ్యక్తిగా మనం సంతోషపడుతున్నా.. సీజేఐగా జస్టిస్ రమణ భారతీయులకు చెందిన వ్యక్తి. దేశాభివృద్ధిలో ఆయన పాత్ర కీలకం కానుంది. ఆయన తెలుగువారిగా మనం గర్వపడితే తప్పులేదు కానీ.. ఓవర్ ప్రొజెక్ట్ చేసి చిత్రీకరించుకోవడం తగని పని.
ఒక ప్రముఖ దిన పత్రిక కూడా తన కార్టూన్ లో న్యాయ దేవత ఆయనకు సుత్తి, త్రాసు ఇస్తున్నట్టుగా ప్రచురించింది. తెలుగువారు అత్యున్నత పీఠం అధిష్టించారని చెప్పడంలో తప్పులేదు కానీ.. అక్కడ కార్టూన్ లో ఆ ఉద్దేశం ప్రతిబింబించదనే చెప్పాలి. ఇవన్నీ ఎవరూ పనిగట్టుకుని చేయరు. కానీ.. కొందరు చేసే అతి ఆయనపై మచ్చ వచ్చేలా ఉంటున్నాయి. ఇటువంటివి ఎంతమాత్రం సమర్ధనీయం కాదు. ఇటువంటి ప్రయత్నాలు ఎవరు చేసినా ఖండించాల్సిందే. జస్టిస్ ఎన్వీ రమణను భారతావనికి తెలుగు నేల అందించిన ముద్దుబిడ్డగా మనమంతా గర్వపడదాం.