Venkayya Naidu : ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అంతకు ముందు బీజేపీ సీనియర్ నేత.. కేంద్ర మంత్రిగా సేవలందించారు. రాజకీయాల్లో వెంకయ్యనాయుడు అజాత శతృవు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన సమయంలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించారాయన.
బీజేపీ సహకారంతో కాంగ్రెస్ అప్పట్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాన్ని విభజించగలిగింది. ఈ క్రమంలో అప్పటి కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ సహకరించిందంటే అది వెంకయ్య వల్లనే. ఆ సమయంలోనే, విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ నష్టపోతుందని ఆలోచించిందీ, అందుకు అనుగుణంగా ప్రత్యేక హోదా వంటి అంశాల్ని తెరపైకి తెచ్చిందీ వెంకయ్యనాయుడే.
కేంద్ర మంత్రిగా వున్న సమయంలో వెంకయ్యనాయుడు రాష్ట్రానికి పలు జాతీయ సంస్థల్ని తీసుకొచ్చారు. రాష్ట్ర అభివృద్ధికీ సహకరించారు. ఓ దశలో రాష్ట్రం పట్ల వెంకయ్యనాయుడు ‘ఎక్కువ శ్రద్ధ’ పెట్టడాన్ని బీజేపీ అధిష్టానం జీర్ణించుకోలేకపోయిందనీ, అందుకే ఆయన్ని కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించి, ఉపరాష్ట్రపతి పదవిలో కూర్చోబెట్టిందనీ అంటారు.
సరే, అందులో నిజమెంత.? అన్నది వేరే చర్చ. రాష్ట్రపతి పదవి చేపట్టాల్సిన వెంకయ్యను ఉప రాష్ట్రపతి పదవికే పరిమితం చేయడం వెనుకా చాలా అనుమానాలున్నాయి. మరిప్పుడైనా వెంకయ్యనాయుడికి రాష్ట్రపతిగా ప్రమోషన్ లభించనుందా.? అంటే, ‘నో’ అనే సమాధానం చెప్పాలి.
గత కొద్ది రోజులుగా ‘రాష్ట్రపతి కానున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు’ అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయనే స్వయంగా ఖండించారు. ఆ ఊహాగానాల్లో నిజం లేదని తేల్చేశారాయన. కానీ, మన తెలుగు నేల నుంచి రాష్ట్రపతి పదవిలో వెంకయ్య కూర్చుంటే చూడాలని మురిసిపోతున్నవారెందరో.!