భారత మహిళా అథ్లెట్లు సత్తా చాటుతూ భారతీయులు గర్వపడేలా చేస్తున్నారు. ప్రపంచ క్రీడా వేదికపై జాతీయ జెండాను రెపరెపలాడిస్తున్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో మీరాబాయి చాను పతకం గెలిచిన తర్వాత రోజు మరో ప్రపంచ క్రీడా వేదికపై భారత మహిళా అథ్లెట్ పతకం గెలిచింది. హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరుగుతున్న క్యాడెట్ వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ ప్రియా మాలిక్ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. ఈ రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఫైనల్‌లో విజయం సాధించి పసిడి కైవసం చేసుకుంది.
ఈ స్వర్ణ పతక విజయంతో సోషల్ మీడియాలో ప్రియా మాలిక్ పై నెటిజన్లు శుభాకాంక్షలతో హోరెత్తేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత చౌతాలా ప్రియా మాలిక్ ను అభినందించారు. పార్లమెంటరీ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేస్తూ.. ప్రియా మలిక్ దేశానికి గర్వకారణంగా నిలిచిందన్నారు. టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారత రెజ్లర్లపై భారీ అంచనాలు ఉన్నాయి. 57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా పురుషుల జాబితాలో పోటీపడనుండగా మహిళల విభాగంలో సీమా, వినేశ్ ఫోగర్, అన్షు, సోనమ్ పోటీలో ఉన్నారు.