దేశవ్యాప్తంగా కరెంటు కొరత.. ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగా బొగ్గు సరఫరా లేకపోవడంతో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తికి ఆటంకాలు కలుగుతున్నాయ్. అయితే, తెలుగు రాష్ట్రాల్లో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఈ సమస్య ఎక్కువగా వచ్చి పడింది. అప్పుడే అనధికారిక కోతలు షురూ అయ్యాయ్.. అధికారిక కోతలూ దారుణంగా వుండబోతున్నాయ్.
ఈ వ్యవహారంపై కేంద్రం స్పందించింది. బొగ్గు పేరుతో జరుగుతున్న రచ్చలో వాస్తవం లేదంటోంది కేంద్రం. మిగులు రాష్ట్రాల నుంచి లోటు రాష్ట్రాలకు కరెంటు షేర్ చేయాలని కేంద్రం, ఓ హెచ్చరిక ప్రకటన విడుదల చేసింది. అలాగే, కేంద్రం వద్ద మిగులుగా వున్న విద్యుత్తునీ వాడుకోవాలని లోటు రాష్ట్రాలకు సూచించింది కేంద్రం.
అసలు ఏది నిజం.? విద్యుత్ విషయమై ఎందుకింత సంక్షోభం.? ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణకు లేని విద్యుత్ కొరత, ఆంధ్రప్రదేశ్‌కి రావడం కొంత అనుమానాస్పదంగానే వుంది. తెలుగు రాష్ట్రాల్లో నీటి ప్రాజెక్టులు పూర్తిగా నిండాయి. అలాంటప్పుడు, విద్యుత్ కొరత ఎందుకు వస్తుంది.?
ఎంత జల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నా, థర్మల్ విద్యుత్ కేంద్రాలదే విద్యుత్ ఉత్పత్తిలో కీలక పాత్ర. అదే అసలు సమస్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బొగ్గు కొరత వుంది. రాష్ట్రం ముందుగా అప్రమత్తమవలేదన్నది ప్రముఖంగా వినిపిస్తోన్న వాదన. అదంతా ఉత్తదేనని జగన్ సర్కారు అంటోంది.
కారణం ఏదైనా, ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ కోత.. అంటే, అది ఏ రాష్ట్రానికీ మంచిది కాదు. కరోనా నుంచి ఇప్పుడిప్పుడే దేశం కోలుకుంటోంది. ఈ తరుణంలో విద్యుత్ కోతలంటే, పారిశ్రామిక రంగం పూర్తిగా పడకేసేస్తుంది. బేషజాలకు పోకుండా విద్యుత్ విషయమై రాష్ట్రాలు పొరుగు రాష్ట్రాలతో సఖ్యత పెంచుకోవాలి.. కేంద్రంతోనూ సంబంధాలు మరింత మెరుగుపర్చుకోవాలి.