అసలు రాజకీయ పార్టీలకు విరాళాలెందుకు.? జనసేన పార్టీ తాజాగా తమకు అందే విరాళాలకు సంబంధించి ‘యూపీఐ నంబర్’ ప్రకటించాక.. వివిధ రాజకీయ పార్టీల నుంచి చిత్ర విచిత్రంగా దూసుకొస్తున్న ప్రశ్నలివి. టీడీపీ మద్దతుదారులు, జనసేన మద్దతుదారులు ఈ ప్రశ్నలు సంధిస్తున్నారు.
‘రాజకీయాల్లో డబ్బు ప్రమేయం వుండకూడదు.. మేం ప్రజల్ని మోసం చేయబోం.. మేం ఓటుని నోటుతో కొనబోం..’ అని జనసేన చెబుతున్నమాట వాస్తవం. అలాగని, జనసేన పార్టీ నడపడానికి డబ్బుల అవసరం రాదా.? పార్టీ అంటే బోల్డన్ని ఖర్చులుంటాయ్. కానీ, జనసేన పార్టీ చేసే రాజకీయ విమర్శలు, చెప్పే సుద్దుల నేపథ్యంలో జనసేన మీద టీడీపీ కావొచ్చు, జనసేన కావొచ్చు.. మరో సంప్రదాయ రాజకీయ పార్టీ కావొచ్చు.. ఇలా గుస్సా అవడంలో వింతేముంది.? అన్నది ఓ వాదన.
ఆ సంగతి పక్కన పెడితే, ఈ మధ్యనే ఓ వార్త బయటకు వచ్చింది. ఆ వార్త సారాంశమేంటంటే, గుప్త విరాళాలు పొందుతున్న రాజకీయ పార్టీల్లో వైసీపీ మొదటి స్థానంలో వుందని. ఏమో, వుండొచ్చు కూడా.! పద్ధతిగా ఇచ్చే విరాళాల్ని తప్పు పట్టలేం. కానీ, ఈ గుప్త విరాళాల గోలేంటి.? సామాన్యుడికి అర్థం కాని వ్యవహారమిది.
వ్యాపారుల్ని బెదిరించి, విరాళాలు బలవంతంగా గుంజుకుని, వాటికి ‘గుప్త విరాళం’ అని పేరు పెడుతున్నారన్నది ఓ ఆరోపణ. చాలా రాజకీయ పార్టీలకు సంబంధించి ఇలాంటి తతంగం ఒకటి నడుస్తుంటుంది. అది బహిరంగ రహస్యం. వైసీపీ కూడా అలా చేస్తోందా.? లేదా.? అన్నదానిపై ఆ పార్టీ వివరణ ఇవ్వాల్సి వుంటుంది.
అయితే, ఇంతవరకు వైసీపీ ఈ విషయమై స్పందించలేదు. ఒకప్పుడు రాజకీయాలు వేరు. ఇప్పుడున్న రాజకీయాలు వేరు. కోట్లకు అధిపతులైనవారే రాజకీయాల్లోకి వస్తున్నారు.. రాజకీయాల్లోనూ బాగా సంపాదిస్తున్నారు. సో, రాజకీయ పార్టీలకు బయట నుంచి విరాళాలతో అవసరమే లేదిప్పుడు. గుప్త విరాళాలు అసలే అవసరం లేదు.
కానీ, గుప్త విరాళాల జాబితా చాలా పెద్దదే దేశంలో రాజకీయ పార్టీలకు సంబంధించి. ఎందుకిలా.? అదంతే.!