కేటీయార్ వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కొత్త వైరం.!

Political Fight

Political Fight : బాధ్యతగల పదవుల్లో వున్న రాజకీయ నాయకులు ‘మాటల’ విషయంలో అత్యంత జాగ్రత్తగా వుండాలి. దురదృష్టమేంటంటే, మాటలు విసిరేటప్పుడు బాధ్యతను విస్మరించడం రాజకీయాల్లో సర్వసాధారణమైపోయింది. పనిగట్టుకుని ఎవర్నో కెలికేందుకు మాటలు విసరడం అనేది ఓ ఫ్యాషన్ అన్నట్టు తయారైంది పరిస్థితి.

అసలు విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అలియాస్ కేటీయార్, ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు, కరెంటు, నీటి సమస్యల గురించి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజానికి, అవి వివాదాస్పద వ్యాఖ్యలు.

తెలంగాణ రాష్ట్ర సమితికి వైసీపీ రాజకీయ ప్రత్యర్థి ఏమీ కాదు. పొరుగు రాష్ట్రంలో వ్యవహారాలతో తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధమే లేదు. కానీ, పొరుగు రాష్ట్రంలో రోడ్లు బాగాలేవనీ, కరెంటు వుండటంలేదనీ, నీటి సమస్యలున్నాయనీ ఎవరో చెప్పిన మాటల్ని కేటీయార్ వల్లించారు.

దాంతో, ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ నేతలకు ఒళ్ళు మండింది. ‘నేను తెలంగాణలో వుండి వచ్చాను. హైద్రాబాద్‌లో నేను వున్న చోట కరెంటు లేదు.. జనరేటర్ మీద వుండాల్సి వచ్చింది. కానీ, ఆ సంగతి నేను బయటపెట్టలేదు కదా..’ అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ, కేటీయార్‌కి కౌంటర్ ఇచ్చారు.

ఏపీలో అమ్మ ఒడి అమలవుతోందనీ, రాష్ట్రంలో అద్భుతమైన పాలన సాగుతోందనీ, దేశంలోని ఇతర రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌ని చూసి నేర్చుకుంటున్నాయని మల్లాది విష్ణు, జోగి రమేష్ తదితర వైసీపీ నేతలు చెప్పారు. చూస్తోంటే, ఇదేదో ఇరు రాష్ట్రాల మధ్యా రాజకీయ రచ్చకు కారణమయ్యేలా వుంది. ‘సమైక్య ఉద్యమం ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తుంది జాగ్రత్త..’ అని మల్లాది విష్ణు, కేటీయార్‌ని హెచ్చరించడం గమనార్హమిక్కడ.