AP: జగన్ మా జోలికి రాకు… వార్నింగ్ ఇచ్చిన పోలీస్ అధికారి సంఘం?

AP: ఇటీవల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించిన లేదా ఏ పర్యటనకు వెళ్ళిన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. పోలీసులు కేవలం అధికార ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని చంద్రబాబు నాయుడు అండతో తన కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ చిత్రహింసలు పెడుతున్నారని తెలిపారు. అదేవిధంగా తన పర్యటనలో పూర్తిగా భద్రత లోపించింది అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు.

పోలీసులు ఈరోజు ఏకపక్షంతో వ్యవహరిస్తే రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి అధికారులు అందరికీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని వాళ్ళు ఎక్కడున్నా శిక్షిస్తాము అంటూ మాట్లాడుతున్నారు. ఇలా పోలీసు వ్యవస్థ గురించి వైయస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలపై ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు జనకుల శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ప్రతీ అంశంలో పోలీసులపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిందన్నారు..

తనకు రక్షణ కల్పించకుండా కుట్రలు చేస్తున్నారని సీఎంగా పని చేసిన వ్యక్తి మాట్లాడటం సబబు కాదని విమర్శించారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని తెలుసుకోవాలని ఆయన హితవుపలికారు. గత ప్రభుత్వ హయామంలో కూడా చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై తమ కేసులు పెట్టామని శ్రీనివాసరావు తెలిపారు.పోలీసులను వీఆర్‌లో పెట్టడం అనేది గత ప్రభుత్వంలో చేశారని మండిపడ్డారు. ఆరోపణలు వచ్చిన అధికారులపై చర్యలు సహజమని చెప్పుకొచ్చారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంత మంది పోలీసులను పక్కన పెట్టారో గుర్తు చేసుకోవాలన్నారు.

పోలీసులు ఎమ్మెల్యేలకు మంత్రులకు వాటాలు పంచుతున్నారంటూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం చాలా దారుణమని ఒక డిజిపి స్థాయిలో ఉన్న వ్యక్తిని పట్టుకొని డాన్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని తెలిపారు. ఇలా జగన్మోహన్ రెడ్డి పోలీస్ వ్యవస్థ గురించి పోలీసుల గురించి చేసిన ఈ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి అంటూ శ్రీనివాసరావు జగన్మోహన్ రెడ్డికి ఓరకంగా వార్నింగ్ ఇచ్చారనే చెప్పాలి. ప్రస్తుతం ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.