పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి వేల కోట్లు దోచేశారంటూ తెలుగుదేశం పార్టీ మీద వైసీపీ ఆరోపణలు గతంలోనూ చేసింది, ఇప్పుడూ చేస్తోంది. ‘రివర్స్ టెండరింగ్’ పేరుతో వైసీపీ, ప్రాజెక్టుల్ని నాశనం చేస్తోంది.. కాంట్రాక్టర్లను మార్చి కాసులు వెనకేసుకుంటోంది.. అంటూ టీడీపీ, వైసీపీని విమర్శిస్తోంది. పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రధాని నరేంద్ర మోడీ కూడా గతంలో ఆరోపించారు. సో, ఈ మూడు కోణాల్లో చూస్తే, పోలవరం ప్రాజెక్టు పేరు చెప్పి.. అడ్డగోలు దోపిడీ జరిగిందని అనుకోవాలి. అవినీతి నిజమైతే, దాన్ని వెలికి తీయాల్సింది ఎవరు.?
కేంద్రం క్లీన్ చిట్ ఎందుకు ఇచ్చింది.!
ఎన్నికలకు ముందు పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రధాని మోడీ కూడా ‘అవినీతి జరిగింది’ అనే ఆరోపించారు. కానీ, కేంద్రం పలు సందర్భాల్లో ‘అవినీతి ఎక్కడా జరగలేదు’ అని స్పష్టతనిచ్చింది. లెక్కలన్నీ పక్కాగా వున్నట్లు పేర్కొంది. చట్ట సభల సాక్షిగా ఈ వివరణలు కేంద్రం నుంచి వచ్చాయి. మరి, పోలవరం ప్రాజెక్ట్ ఎవరికి ఏటీఎంగా మారింది.? అనే విషయమై ఇప్పటికీ స్పష్టత లేదు. అవినీతి జరిగితే, పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంలా ఎవరైనా వాడుకుని వుంటే.. ఆ లెక్కలు బయటకు రావాల్సిందే కదా.? పైగా 2014 నుంచి 2018 వరకు బీజేపీ – టీడీపీ కలిసే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారాన్ని నడిపాయి కూడా.!
ఇప్పుడు వైసీపీ వ్యూహమేంటి.?
కేంద్రం పోలవరం ప్రాజెక్టు అంచనాలపై కొర్రీ పెట్టింది. 55 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయానికి గతంలో ఆమోద ముద్ర వేసిన కేంద్రం, ఇప్పుడు 25 వేల కోట్లకు సరిపెడుతోంది. కేంద్రం తీరుని నిలదీయాల్సిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, అధికారం తన చేతిలో వుండి కూడా కేంద్రాన్ని ప్రశ్నించడంలేదు. చిత్రంగా ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తున్నారు వైసీపీ మంత్రులు. ఇదెక్కడి చోద్యం.? చంద్రబాబు హయాంలో అవినీతి జరగి వుంటే, కేంద్రమే బయటపెట్టి వుండేది. కానీ, అలా జరగలేదు. పోనీ, వైసీపీ ఆ పని చేయగలిగిందా.? అంటే అదీ లేదు.
ఒక్కటి మాత్రం నిజం. పొరుగు రాష్ట్రం తెలంగాణ.. ప్రాజెక్టుల విషయంలో అయినా, రాజధాని హైద్రాబాద్ అభివృద్ధి విషయంలో అయినా, ఇతరత్రా విషయాల్లో అయినా దూసుకెళుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆ పరిస్థితి లేదు. ప్రత్యేక హోదా, అమరావతి, ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు.. ఇలా ఒకటొకటీ.. చేజారిపోతున్నట్లే కనిపిస్తోంది. రాష్ట్రం ఇలా ఒక్కోదాన్నీ కోల్పోయే పరిస్థితి వచ్చిందంటే.. ఈ దుస్థితికి కారణమెవరు.?