Polavaram Project : పోలవరం ప్రాజెక్టుని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఏటీఎంలా వాడేసుకున్నారని చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంచలన ఆరోపణలు చేశారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. టీడీపీ – బీజేపీ మధ్య పొత్తు పటాపంచలవడంతో ప్రధాని మోడీ నుంచి అసహనంతో వచ్చిన రాజకీయ విమర్శ అది.
వాస్తవానికి పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఆ జాతీయ ప్రాజెక్టులో అవినీతి జరిగితే, ఆ అవినీతి మరక కేంద్ర ప్రభుత్వానికి అంటుకోవాలి. అవినీతి జరిగిందని ప్రధాని స్వయంగా చెప్పడమంటే మామూలు విషయం కాదు. ఆ అవినీతి నుంచి ఒక్క పైసా కూడా వెనక్కి తీసుకురాలేకపోయారు ప్రధాని మోడీ. ఇది మోడీ సర్కారు వైఫల్యం.
మోడీ చేసిన ఆరోపణల్ని వైసీపీ పదే పదే ప్రస్తావిస్తుంటుంది. మూడేళ్ళుగా ఏపీలో అధికారంలో వున్న వైసీపీ, ఆ పోలవరం ప్రాజెక్టు బాధ్యతల్ని చేపడుతూ కూడా, అందులోని అవినీతిని వెలికి తీయలేకపోవడం మరో విశేషం. కానీ, చంద్రబాబు మీద ఆరోపణల పర్వం కొనసాగిస్తుంటుంది.
నిన్న మొన్నటిదాకా మంత్రి పదవిలో వున్న అనిల్ కుమార్ యాదవ్ మీసం మెలేసి మాట్లాడారు పోలవరం గురించి. ఇప్పుడు దాదాపు అదే స్థాయిలో అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు. కానీ, పోలవరం ప్రాజెక్టు పనులైతే ముందుకు కదలడంలేదు. మాటలేనా, పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేసేదేమన్నా వుందా.? అని జనం ప్రశ్నిస్తున్నారు.
పదవి పోయాక, ‘ప్రాజెక్టుతో నాకేంటి సంబంధం’ అని ఇప్పుడు అనిల్ చేతులెత్తేసినట్టు, అంబటి కూడా రెండేళ్ళ తర్వాత చేతులెత్తేయడం ఖాయం.