గులాబీ వెలవెల.. వైఎస్ షర్మిలకి లక్కీ ఛాన్స్.?

Pink Wave Weakens Good Chance For Ys Sharmila | Telugu Rajyam

నో డౌట్, తెలంగాణలో గులాబీ పార్టీ రంగు వెలిసిపోతోంది. ప్రజా వ్యతిరేకత స్పష్టంగా హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికతో తేటతెల్లమైపోయింది. నిజానికి, దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లోనే తెలంగాణ రాష్ట్ర సమితి కథేంటో తేలిపోయింది. అయితే, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో ‘సెంటిమెంట్’ వర్కవుట్ అయి, టీఆర్ఎస్ కాస్త నిలదొక్కుకోగలిగింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక వచ్చేసరికి మళ్ళీ కథ అడ్డం తిరిగింది.

వాస్తవానికి ఇవన్నీ కొత్త పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కలిసొచ్చే అంశాలే. వైఎస్ షర్మిల, కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించి, హుజూరాబాద్ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి వుంటే, ఖచ్చితంగా ఫలితం ఇంకోలా వుండేది. వైటీపీ గెలుస్తుందని కాదుగానీ, వైటీపీ ఉనికి అయితే కనిపించేదే.
ఇదిలా వుంటే, వైఎస్సార్ తెలంగాణ పార్టీ వైపు ఇతర పార్టీలకు చెందిన నేతలు చూస్తున్నారన్న ప్రచారం ఇప్పుడు మరింత ఊపందుకుంది. వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్రకు మీడియాలో చోటు పెద్దగా దక్కకపోయినా, స్థానికంగా ఎక్కడికక్కడ ఈ పాదయాత్ర గురించి చర్చ జరుగుతోంది.

కాగా, తెలంగాణలో బలమైన ప్రతిపక్షం లేని లోటుని కొంతమేర బీజేపీ భర్తీ చేస్తున్న దరిమిలా, వైఎస్ షర్మిల తమ పార్టీకి ప్రత్యేకంగా ఓటు బ్యాంకు ఎలా సాధిస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్సే. కానీ, రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయ్.

ఒక్కసారి షర్మిల పార్టీ వైపు నేతలు అడుగులేయడం మొదలు పెడితే, ఆ తర్వాత సమీకరణాలు వేగంగా మారిపోవచ్చు. అయితే, తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కొనే క్రమంలో తాను మిగతా పార్టీలకు మిన్న.. అని వైటీపీని నిలబెట్టాల్సిన బాధ్యత పూర్తిగా షర్మిల మీదనే వుంది.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles