Pink Politics : తెలంగాణ రాష్ట్రంలో చిత్ర విచిత్రమైన రాజకీయాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి ఈటెల రాజేందర్, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ఎలా గెంటివేయబడ్డారో చూశాం. ఈటెల రాజేందర్ కుటుంబం భూ కబ్జాలకు పాల్పడిందన్న ముద్ర వేసేసి, అత్యంత చాకచక్యంగా పావులు కదిపింది అధికార తెలంగాణ రాష్ట్ర సమితి.
ఈటెల భూ కబ్జా వ్యవహారంపై ఇప్పటికీ తెలంగాణ సర్కారు నిజాలు నిగ్గు తేల్చలేకపోయింది. ఇక, టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విషయంలో మాత్రం గులాబీ రాజకీయం మరోలా వుంది. ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవ కారణమన్న అభియోగాలున్నాయి.
బాధితుడు మరణ వాంగ్మూలమిచ్చాడు ఆత్మహత్యకు పాల్పడేముందు సెల్ఫీ వీడియో ద్వారా. కుటుంబంలో అంతా ప్రాణాలు కోల్పోయారు.. ఓ చిన్నారి ప్రాణాలతో పోరాడుతోంది. ఇంతటి దయనీయ స్థితి ఏ కుటుంబానికీ రాకూడదు. బాధితుడు రామకృష్ణ తాను చనిపోయేముందు విడుదల చేసిన సెల్ఫీ వీడియోలో, వనమా రాఘవ తన భార్యను కోరుకున్నాడంటూ ఆరోపించడం గమనార్హం.
ఈ కేసులో ఇంతవరకు వనమా రాఘవను పోలీసులు అరెస్ట్ చేయలేదు. తన కుమారుడి విషయమై మీడియాతో మాట్లాడేందుకు వనమా వెంకటేశ్వరరావు మీడియా ముందుకు రాలేకపోతున్నారు. పోలీసులేమో, వనమా రాఘవను అరెస్టు చేయలేదంటున్నారు.. కానీ, మీడియాలో నిన్న మాత్రం వనమా వెంకటేశ్వరరావు తన కుమారుడ్ని పోలీసులకు అప్పగించినట్లుగా వార్తలొచ్చాయి.
వనమా రాఘవ ఇంటికి తాజాగా నేడు పోలీసులు నోటీసులు పంపారట. సాయంత్రం లోగా అరెస్టు చూపిస్తారో, చేస్తారోగానీ.. తెలంగాణ రాజకీయాల్లో ఇదో పెను ప్రకంపనగానే చెప్పుకోవాలి. మామూలుగా అయితే, ఈపాటికే వనమా వెంకటేశ్వరరావు మీద అధికార పార్టీ వేటు వేసి వుండాలి. అలా జరగలేదంటే, వనమా తనయుడి అక్రమాలతో అధికార పార్టీకి సంబంధాలున్నాయనే అనుకోవాలేమో.