అంతా అనుకున్నట్టే జరుగుతోంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పెద్ద రచ్చే జరుగుతోంది. అసలు కాంగ్రెస్ సందడే కనిపించడంలేదు. చివరి నిమిషం వరకు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అటు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, ఇటు భారతీయ జనతా పార్టీ పోటీ పడుతున్నాయి.
ఓటుకు కనీసం ఆరు వేల నుంచి 20 వేల రూపాయలదాకా ఇచ్చి ఓటర్లను ప్రలోభ పెడుతున్నాయి రాజకీయ పార్టీలు. ‘అబ్బే, అలా ప్రలోభ పెడుతున్నది తెలంగాణ రాష్ట్ర సమితి నేతలే..’ అని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. ‘ఆ అవసరమే మాకు లేదు..’ అని టీఆర్ఎస్ అంటోంది.
పోలింగ్ కేంద్రాలకు వెళుతున్న ఓటర్లను ఆయా పార్టీలకు చెందిన మద్దతుదారులు ప్రలోభ పెడుతున్నారు. ఈ క్రమంలో పెద్దయెత్తున గొడవలు జరుగుతున్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నా, పరిస్థితులు అదుపులోకి రావడంలేదు.
టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డిని పలు చోట్ల ఈటెల రాజేందర్ మద్దతుదారులు అడ్డుకుంటుండడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. స్థానికేతరుడంటూ కౌశిక్ రెడ్డిపై ఈటెల మద్దతుదారుల విమర్శలు చేస్తుంటే, తాను స్థానికుడినేనని అంటున్నారాయన.
మొత్తమ్మీద, హుజూరాబాద్ ఎన్నికల ప్రచారానికి మించిన రాజకీయ రచ్చ పోలింగ్ రోజున సాగుతోంది. దాడులు ప్రతిదాడులతో హుజూరాబాద్ నియోజకవర్గంలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా వుంటుందని తెలిసీ, అధికారులు ఎందుకు తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోయారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.