Hyderabad: వనమా రాఘవేంద్రరావు అరెస్టు విషయంలో ట్విస్ట్.. అసలేం జరిగిందంటే?

Hyderabad: ఇటీవలే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గ్యాస్ లీక్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. నాగ రమ్యకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేంద్ర రావు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ అరెస్టు విషయంలో ఒక ట్విస్ట్ చోటు చేసుకుంది. వనమా రాఘవేంద్రరావు తమకు దొరకడం లేదు అంటూ కొత్తగూడెం జిల్లా పోలీసులు ప్రకటించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.

అతడి కోసం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో ఏడు ఎనిమిది బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నామని పాల్వంచ లోని ఏ ఎస్ పి రోహిత్ రాజ్ వెల్లడించారు. అతడు దొరికితే కచ్చితంగా కస్టడీలోకి తీసుకుంటాం అని తెలిపారు. అంతేకాకుండా గతంలో రాఘవ పై నమోదు అయిన కేసులో ఆధారంగా కూడా దర్యాప్తు చేస్తామని తెలిపారు. ఆధారాలు లభిస్తే తప్పకుండా రాఘవ ఫై రౌడీషీట్ నమోదు చేస్తాము అంటూ ఏఎస్పీ వెల్లడించారు. నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య వ్యవహారంలో రాఘవేంద్రరావు హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ఆత్మహత్యకు ముందు నాగ రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో చర్చనీయాంశమైన నేపథ్యంలో, ఈ విషయంపై స్పందించిన వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెం నియోజకవర్గం ప్రజలకు లేఖ రాశారు.

తమ కుమారుడి పై వచ్చిన ఆరోపణలలో భాగంగా పోలీసుల విచారణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు. అంతే కాకుండా తన కుమారుడు దొరికితే పోలీసుల విచారణకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు లేఖలో తెలిపాడు. అయితే మొదట రాఘవేంద్ర రావు ను అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. అంతేకాకుండా 302,306,307 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ప్రసారాలు జోరుగా జరిగాయి.కానీ రాఘవ ను పోలీసులు అరెస్టు చేయలేదని ఏఎస్పీ అధికారంగా ప్రకటించడంతో గందరగోళం ఏర్పడింది.