టీఆర్ఎస్, వైఎస్సార్సీపీ మధ్య ఫొటోల గోల.!

కొద్ది రోజుల క్రితం వైసీపీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు ఓ ట్వీటేశారు. అందులో వ్యవసాయ కూలీల దగ్గరకు వెళ్ళి మరీ వ్యాక్సిన్లను వేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కనిపించారు. అదే ఫొటో, తాజాగా తెలంగాణ మంత్రి కేటీయార్ ట్విట్టర్‌లో దర్శనమిచ్చింది. ఏపీలో వ్యాక్సినేషన్ గురించి విజయసాయిరెడ్డి అదే ఫొటోతో ట్వీటేస్తే.. ఆ ఫొటోని తాజాగా కేటీయార్, తెలంగాణలోనిదిగా చెబుతూ ట్వీటేయడం ఇరు పార్టీల మధ్యా వివాదానికి కారణమయ్యింది. ఇంతకీ, ఆ ఫొటో ఎక్కడిది.? తెలంగాణలోనిదా.? ఆంధ్రప్రదేశ్‌లోనిదా.? ఫొటో ఏదైతేనేం.. విషయం ముఖ్యం. అందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పడుతున్న కష్టాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. వ్యాక్సిన్లను రాష్ట్రాలు నేరుగా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కేంద్రమే, రాష్ట్రాలకు వ్యాక్సిన్లను ఉచితంగా అందిస్తోంది.

అలాంటప్పుడు, ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా.. వ్యాక్సిన్ల విషయమై ‘క్రెడిట్’ కోసం కిందా మీదా పడితే ఎలా.? అన్నది ఓ చర్చ. రాజకీయాలన్నాక ‘క్రెడిట్ కోసం’ యుద్ధాలు తప్పవు. మొన్నీమధ్యనే హైద్రాబాద్‌లో ఓ చిన్నారిపై హత్యాచారం జరిగితే, ఆ ఘటనలో నిందితుడు దొరికేశాడంటూ తెలంగాణ మంత్రి కేటీయార్ తొందరపడి ట్వీటేసి, ఆ తర్వాత నాలిక్కరచుకున్నారు. చివరికి నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడనుకోండి.. అది వేరే సంగతి. ఇక, ఇప్పుడు తన తాజా ట్వీటుతో కేటీయార్ ఇరకాటంలో పడ్డారా.? విజయసాయిరెడ్డిని ఇరకాటంలో పడేశారా.? ఓ దిన పత్రికలో విజయనగరం జిల్లాలో తీసిన ఫొటోగా చెప్పబడుతున్న ఫొటో.. ఇంకో దినపత్రికలో తెలంగాణలోని ఓ జిల్లాలో తీసిందిగా పేర్కొన్నారు. ఇంతకీ ఏది నిజం.? ఏమోగానీ, ఇటు గులాబీ కార్మికులు.. అటు బులుగు కార్మికులు.. సోషల్ మీడియా వేదికగా బాహాబాహీకి దిగుతున్నారాయె.