వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా ఇటీవల వైసీపీ ప్లీనరీ వేదికగా వైఎస్ జగన్ ‘ఎంపికైన’ సంగతి తెలిసిందే.
మామూలుగా అయితే, రెండేళ్ళకో.. మూడేళ్ళకో.. నాలుగేళ్ళకో.. ఐదేళ్ళకో పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించుకుని, అధ్యక్ష ఎన్నికలు జరుపుతుంటారు. కానీ, ఆ అవసరమే లేకుండా తనను తాను శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.
ఈ విషయమై పెద్ద రాజకీయ దుమారమే చెలరేగింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ గనుక, ఆయన్ని పార్టీలో ఎవరూ దించేసే అవకాశమే లేదు గనుక, ఆయన శాశ్వత అధ్యక్షుడిగా వుంటే తప్పేంటి.? అన్న వాదనా లేకపోలేదు. తెలంగాణ రాష్ట్ర సమితికి కేసీయార్ మాత్రమే అధినేత.. టీడీపీకి ఒకప్పుడు ఎన్టీయార్.. ఆ తర్వాత వైఎస్ జగన్.
జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ అధినాయకుడు. ఏదో పద్ధతి పాటించాలి కాబట్టి, పార్టీలో ఎన్నికలు జరుగుతుంటాయ్ అధ్యక్ష పదవికి. పార్టీ ముఖ్య నేతలు అధినేత పేరుని ప్రతిపాదిస్తారు.. ఆ పేరుకి పోటీగా ఇంకెవరూ నిలబడరు. చివరికి ఎప్పుడూ వుండే అధ్యక్షుడే ఇంకోసారి అధ్యక్షుడవుతారు. ఇదీ సాధారణంగా జరిగే వ్యవహారం.
అయినాగానీ, ఓ పద్ధతి అంటూ వుంటుంది కదా.? 2024 ఎన్నికల్లో 175 సీట్లూ గెలిచేస్తామని వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చెబుతున్నారు. అలాగని, ఎన్నికలు జరగకుండా వుండవ్ కదా.? పార్టీలో అయినా అంతే.! ప్రజాస్వామ్యంలో కొన్ని పద్ధతులు పాటించాలి.
ఇదే విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం, వైసీపీ ప్రధాన కార్యదర్శికి లేఖ ద్వారా తెలియజేసింది. శాశ్వత అధ్యక్షుడు లేదా పార్టీలో శాశ్వత పదవులు రాజ్యాంగ విరుద్ధమైనవనీ, ప్రజాస్వామ్యంలో ఇలాంటి పోకడలు సరికావనీ కేంద్ర ఎన్నికల సంఘం, వైసీపీ ప్రధాన కార్యదర్శికి పంపిన లేఖలో పేర్కొంది.
కోరి వివాదాలు తెచ్చుకోవడమెందుకు.? కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకోదని తెలిసీ, వైఎస్ జగన్ ఎందుకింత సాహసం చేశారు.?