మీరు రోడ్లెక్కితే.. మిమ్మల్ని ముంచెయ్యడానికి వచ్చేస్తున్నా.. అన్నట్టుంది కోవిడ్ 19 వ్యవహారం. మొదటి వేవ్ ముంచేసింది.. రెండో వేవ్ నిండా ముంచేసింది.. మూడో వేవ్ ఏం చేస్తుందో ఏమో. మూడో వేవ్ వస్తుందన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో సెకెండ్ వేవ్ కొనసాగుతుండగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
దేశవ్యాప్తంగా కోవిడ్ 19 వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. అయినాగానీ, మూడో వేవ్ రాకుండా ఆగే పరిస్థితే లేనట్టుంది. అతి త్వరలో.. అంటే, వచ్చే నెలలోనే మూడో వేవ్ షురూ కాబోతోందట. ఇప్పుడిప్పుడే దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తీవ్రత గణనీయంగా తగ్గుతోందనే సంతోషంలో వున్నాం మనమంతా.
కానీ, ఇంతలోనే మూడో వేవ్ ముప్పు పొంచి వుందంటూ హెచ్చరికలు మరింత జోరుగా వినిపిస్తున్నాయి. ఓ అధ్యయనం ప్రకారం, ఆగస్ట్ రెండో వారం నుంచి కోవిడ్ మూడో వేవ్ తీవ్రత కనిపిస్తుందనీ, చాలా తక్కువ రోజుల్లోనే పీక్ స్టేజ్ కనిపించబోతోందనీ తెలుస్తోంది. రెండో వేవ్ కంటే మూడో వేవ్ చాలా చాలా తీవ్రంగా వుండబోతోందన్నది సదరు అధ్యయనం తాలూకు సారాంశం.
ప్రధానంగా మూడో వేవ్ పిల్లల మీద ప్రభావం చూపించవచ్చునంటూ పలు నివేదికలు ఇప్పటికే వెలుగు చూశాయి. అయితే, అందుకు తగ్గ శాస్త్రీయ ఆధారాలేమీ లేవని కొందరు వైద్యులు కొట్టి పారేస్తున్నారు. ఇదిలా వుంటే, జనంలో కోవిడ్ భయం తగ్గిందని అనుకోలేంగానీ.. జీవనోపాధి కోసం జనం రోడ్డెక్కక తప్పడంలేదు. రాష్ట్రాలు ఆర్థిక కార్యకలాపాల్ని పెంచే దిశగా కరోనా లాక్ డౌన్ నుంచి వెసులుబాట్లు కల్పించేశాయి.
ఈ నేపథ్యంలో కోవిడ్ మహమ్మారి మూడోస్సారి మరింత తీవ్రంగా విరుచుకుపడే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. దాని తీవ్రత ఎంత.? అన్నది ప్రస్తుతానికైతే మిలియన్ డాలర్ల ప్రశ్నే. మొదటి వేవ్ నుంచి పాఠాలు నేర్చుకోలేకపోయాం.. రెండో వేవ్ సందర్బంగా చాలామందిని కోల్పోయాం. మరి, మూడో వేవ్ ఏమవుతుంది.? వ్యాక్సినేషన్ పని చేసి, మూడో వేవ్ తీవ్రత తక్కువగా వుండాలని ఆశిద్దాం. ఈలోగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతమై, ఎక్కువమందికి వ్యాక్సిన్ అందాలని కోరుకుందాం.