‎Stuntman Raju Death: షూటింగ్లో ప్రమాదం.. స్టంట్ మాస్టర్ రాజు మృతి.. డైరెక్టర్ పై కేసు నమోదు.!

‎‎Stuntman Raju Death: తాజాగా సినిమా ఇండస్ట్రీలో ఒక విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ స్టంట్ మాస్టర్ ఎస్ఎం రాజు మూవీ షూటింగ్ లో ప్రమాదంలో చనిపోయాడు. సినిమా షూటింగ్లో భాగంగా హై రిస్క్ కారు స్టంట్ చేస్తూ అనుకోకుండా ప్రమాదవశాత్తు ఆయన చనిపోయారు. హీరో ఆర్య సినిమా షూటింగ్లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఇది అందరినీ ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే.

‎ కాగా ఈ ఘటనకు సంబంధించి డైరెక్టర్ పా రంజిత్ పై కేసు కూడా నమోదైంది. నిర్లక్ష్యం వల్లే స్టంట్ మాస్టర్ రాజు చనిపోయారని ఆరోపిస్తూ సినిమా డైరెక్టర్ పా రంజిత్, మరో ముగ్గురిపై కీజాయూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సంఘటన జరిగిన సమయంలో రాజు తల లోపల రక్తస్రావంతో పాటు తీవ్రమైన అంతర్గత గాయాలకు గురయ్యాడని, ఆ సమయంలో బయట గాయాలు కనిపించలేదని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడించింది. దాంతో దర్శకుడు పా రంజిత్, అసిస్టెంట్ డైరెక్టర్ రాజ్ కమల్, వాహన యజమాని ప్రకాష్, షూట్ మేనేజర్ వినోద్‌లపై కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు ధృవీకరించారు.

‎ఈ విషయం గురించి పోలీసులు మాట్లాడుతూ.. పోస్ట్‌మార్టంలో అంతర్గత గాయం, తలలో రక్తస్రావం జరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా, మేము నిర్లక్ష్యం కేసు నమోదు చేశాము అని నాగపట్నం పోలీసు అధికారి తెలిపారు. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న సినిమా కోసం రాజు నాగపట్నం జిల్లాలో హై రిస్క్ స్టంట్ చేస్తున్నాడు. రాజు వాహనం ర్యాంప్‌పై వేగాన్ని పెంచుతూ గాలిలో పల్టీలు కొడుతుండగా, మరొక వాహనం నేలపై వేగంగా దూసుకుపోతున్నట్లు వీడియోలో ఉంది. రాజుకు మొదట్లో ఎలాంటి గాయాలు లేకపోయినా, కాసేపటికే కుప్పకూలిపోయాడు. స్థానిక ఆసుపత్రికి తరలించేలోపే అతడు మరణించాడు. అతని మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. మరోసారి స్టంట్ కళాకారుల భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి.