పవన్ ప్రశ్న: చెల్లికి న్యాయం చేయలేని జగన్, రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారా.?

Pawan Questions Ys Jagan Regarding YS Viveka's death mystery

Pawan Questions Ys Jagan Regarding YS Viveka's death mystery

చెల్లెలికి న్యాయం చేయలేని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్రానికి న్యాయం చేయగలరా.? అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో నిలదీశారు. బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయమై వైఎస్ జగన్ ప్రభుత్వం ఎందుకు నిజాల్ని నిగ్గు తేల్చలేకపోయిందని జనసేన అధినేత ప్రశ్నించారు.

ఈమధ్యనే ఇంకోసారి వైఎస్ వివేకా కుమార్తె సునీత, తన సోదరుడు ముఖ్యమంత్రి అయినాగానీ.. వివేకా మరణం వెనుక మిస్టరీని ఛేదించలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసిన వైనాన్ని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. ‘మీ ఇంట్లో మీ చెల్లెలు షర్మిల మీరు పదవి ఇవ్వలేదని రోడ్డెక్కారు.. ఇంకో పార్టీ పెడుతున్నారు.. మరి, దశాబ్దాలుగా అధికారం దక్కని బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, ఇతర కులాలు.. ఎందుకు రోడ్డెక్కకూడదో సమాధానం చెప్పాలి.. వాళ్ళని ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు.. వారిని బెదిరిస్తున్నారు.. ప్రలోభపెడుతున్నారు.. పథకాలు ఆపేస్తామని బెదిరిస్తున్నారు.. ఇకపై ఇవన్నీ ఆగిపోవాలి..’ అంటూ జనసేనాని వ్యాఖ్యానించారు. ఐఏఎస్ అధికారిగా వివిధ విభాగాల్లో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహించిన రత్నప్రభ గెలుపుతో, రాష్ట్రానికి న్యాయం జరుగుతుందన్నది జనసేన అధినేత వాదన. ఓటర్లే తిరగబడాలి.. ఓటర్లే నిలదీయాలి.. ఎన్నికల్లో పోటీ చేయడానికెందుకు భయం.? ఓట్లెయ్యడానికెందుకు భయం.? వేలాదిమంది లక్షలాది మంది యువకులు ఎన్నికల ప్రచారం కోసం వస్తున్నారు.. ప్రచార సభల్లో కనిపిస్తున్న యువత, ఓట్లెయ్యడానికి రాకపోవడం వల్లే ఈ సమస్య.. అని పవన్ కళ్యాణ్ తనను చూసేందుకు వచ్చిన యువతని ఉద్దేశించి నిలదీశారు. అంతా బాగానే వుందిగానీ, పవన్ ఎక్కడా తెలుగుదేశం పార్టీ ప్రస్తావనే తీసుకురాలేదు.

తిరుపతి ఉప ఎన్నిక బరిలో ప్రధాన రాజకీయ పార్టీలుగా వైసీపీ, టీడీపీ వున్నాయి.. బీజేపీకి గతంలో వచ్చిన ఓట్లు చూస్తే, ఆ పార్టీ నోటాతోనే పోటీ పడాలి. ఆ బీజేపీ నుంచి రత్నప్రభ పోటీ చేస్తోంటే, జనసేన మద్దతిస్తున్న విషయం విదితమే. ఆంద్రపదేశ్‌లో దేవాలయాలపై దాడులు సహా అనేక కీలక అంశాల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తిరుపతి బహిరంగ సభలో ప్రస్తావించారు. కాగా, తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని తన తమ్ముడిగా అభివర్ణించారు. పవన్ కళ్యాణ్ నటించిన ఓ సినిమాలోని డైలాగ్ కూడా చెప్పారు.