జనసేనాని రాజకీయం, తెలంగాణ జనసైనికుల్లో తీవ్ర గందరగోళం.!

Pawan Kalyan

Pawan Kalyan : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘టోటల్ కన్ఫ్యూజన్’ పొలిటీషియన్ ఎవరన్నా వున్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమేనన్న చర్చ తరచూ జరుగుతుంటుంది. మరి, కేఏ పాల్ సంగతేంటి.? అని ఎవరన్నా ప్రశ్నిస్తే, జనసేన నేతలకు ఒళ్ళు మండిపోవడం సహజమే. జనసేనాని ఆలోచనలు వేరు, కేఏ పాల్ హంగామా వేరు. అయితే, జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటన్నదానిపై జనసైనికులకు ఏమన్నా ఓ స్పష్టత వుందా.? అధినేత పవన్ కళ్యాణ్ ఏనాడైనా ఆ స్పష్టత వారికి ఇచ్చారా.? అన్నదే కాస్త ఆలోచించాల్సిన విషయం.

సినీ నటుడిగా పవన్ కళ్యాణ్ మీద వున్న అభిమానమే, పవన్ కళ్యాణ్ అభిమానులంతా జనసైనికులుగా మారడానికి కారణమన్నది నిర్వివాదాంశం. అయితే, ఇన్నేళ్ళుగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వున్నా, ఎలాంటి పదవులూ ఆయన ఆశించకపోవడం, పార్టీకి అంటూ ఓ ‘పవర్’ లేకపోవడం జనసైనికుల్ని తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది.

ఎప్పుడూ ఎవరో ఒకరి జెండాని జనసేన జెండాతో కలిసి మొయ్యడమేనా.? ‘జనసేన సాధించింది ఇదీ..’ అని గర్వంగా చెప్పుకోడానికి ఏమన్నా వుందా.? అని చాలామంది జనసైనికులు ఆవేదన చెందుతున్నమాట వాస్తవం. తెలంగాణలో జనసైనికుల పరిస్థితి మరీ దారుణం. 2024 ఎన్నికల్లో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనేదానిపై జనసేనానికే స్పష్టత లేదు.

దాంతో, 30 శాతం సీట్లలో ప్రభావం చూపగలమన్న జనసేనాని వ్యాఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియని పరిస్థితి జనసైనికులది. ఆంధ్రప్రదేశ్ సంగతి సరే సరి. ఏపీలో అధికారంలోకి వస్తే, తెలంగాణలో జనసేన వుంటుందో లేదోనన్న అనుమానమూ తెలంగాణ జనసైనికుల్ని వెంటాడుతోంది. వైసీపీ ఏపీలో అధికారంలోకి రాగానే తెలంగాణలో పార్టీని మూసేసిన సంగతి తెలిసిందే.