జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడకు వెళ్లిన జనసేనాని ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.పూర్తి సంప్రదాయ వస్త్రధారణలో పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్నారు.
శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న జనసేనానికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు.. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఏడాది నుంచి స్వామివారి ఆశీస్సుల కోసం రావాలనుకుంటున్నట్లు చెప్పారు. కరోనా ప్రభావంతో రాలేకపోయానని.. ఇవాళ స్వామివారి ఆశీస్సులు లభించాయి అన్నారు. పవన్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ గురువారం తిరుపతి పర్యటనకు వచ్చారు.
పార్టీ పీఏసీ సమావేశం నిర్వహించారు. తిరుపతిలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పవన్ కళ్యాణ్ హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ కేంద్ర నాయకత్వం జనసేన పార్టీకి ఇస్తున్న ప్రాధాన్యం రాష్ట్రంలో బీజేపీ నాయకత్వం ఇవ్వడం లేదని అన్నారు. ‘బీజేపీ కేంద్ర పెద్దలు ఇస్తున్నంత మర్యాద రాష్ట్రంలో బీజేపీ నాయకులు జనసేనకు ఇవ్వడం లేదని పీఏసీలో నేతలు అంటున్నారు. కలసి ప్రయాణం చేయాలంటే చిన్న చిన్న తప్పులు సరిదిద్దుకుని ముందుకు వెళ్లాలి. ’ అని పవన్ కళ్యాన్ వ్యాఖ్యానించారు. ఒకవేళ తిరుపతి ఉప ఎన్నికలను బీజేపీ తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే తాము బీజేపీకి అండగా నిలబడతామని ప్రకటించారు.