ఆంధ్రప్రదేశ్ లో అందరి దృష్టి ఇప్పుడు తిరుపతి ఉపఎన్నికపైనే పడింది. భారీ ఆధిక్యాన్ని దక్కించుకోవాలని అధికార వైసీపీ యత్నిస్తుంటే, ఎలగైనా గెలవాలని టీడీపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా విజయం సాధిస్తామని జనసేన-బీజేపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థి రత్నప్రభ తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దిగిన ఆమె..తనను గెలిపిస్తే పార్లమెంట్ లో ఏపీ ప్రజల గళాన్ని వినిపిస్తానని చెప్పారు. అంతేకాదు ఇన్నాళ్లకు మాతృభూమికి సేవచేసే అవకాశం తన ముందుందని చెప్పారు. ప్రజల కోసం పనిచేయడంలోనే తనకు ఆనందం ఉంటుందన్నారామె.
కేవలం తిరుపతి గురించే కాకుండా రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తానని తెలిపారు. గతంలో తాను చేసిన ట్వీట్లకు ప్రస్తుత ఎన్నికలకు సంబంధం లేదని రత్నప్రభ స్పష్టం చేశారు. సీఎం జగన్ ను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ తో రాజకీయాలతో ముడిపెట్టొద్దన్నారు. ఈ సందర్భంగా ట్వీట్ పై ఆమె వివరణ ఇచ్చారు. జగన్ ను ప్రశంసిస్తూ చేసిన ట్వీట్ నిజమేనని, మంచి పని చేస్తే వైసీపీకి మద్దతిచ్చినట్లు కాదన్నారు. డబ్బుకు ఓటెయ్యాలో నీతినిజాయితీకి ఓటు వేయాలో ప్రజలు తెల్చుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇక తిరుపతి ఉపఎన్నికలో బీజేపీకి జనసేన మద్దతు లేదన్న ప్రచారాన్ని రత్నప్రభ కొట్టిపారేశారు.
తన అభ్యర్థిత్వంపై జనసేనాని పవన్ కల్యాణ్ పూర్తి సంతృప్తిగా ఉన్నారని.. 200శాతం తనకు మద్దతిస్తారని స్పష్టం చేశారు.ఇక తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా ప్రచారం చేసేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధంగా ఉన్నారంటూ రత్నప్రభ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పవన్ తో భేటీ అయి ఉపఎన్నికపై చర్చించానని.. ప్రచారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వస్తానని మాటిచ్చారని ఆమె తెలిపారు. రత్నప్రభ ప్రకటనతో అటు తిరుపతి జనసైనికుల్లో జోష్ వచ్చినట్లైంది. ఐతే పవన్ నిజంగా ప్రచారానికి వస్తారా..? లేదా..? అనేది ఆసక్తికరంగా మారింది. రత్నప్రభ ప్రకటన జనసేన కార్యకర్తలను ఆకట్టుకునేందుకా.. లేదా పవన్ నిజంగా తిరుపతిలో ప్రచారం చేస్తారా అనే దానిపై రెండు పార్టీల్లో చర్చ జరుగుతోంది.