పాండోరా రాజకీయం: హవ్వ.. జగన్‌ని లాగుతున్న చంద్రబాబు.!

ఇదెక్కడి రాజకీయం.? అని ఎవరైనా ముక్కున వేలేసుకోవచ్చుగాక. సుదీర్ఘ రాజకీయ అనుభవం వున్న చంద్రబాబు ఇంత నీఛ స్థితికి దిగజారి ఎలా ఆలోచిస్తున్నారని జనం ఆశ్చర్యపోవచ్చుగాక. కాదేదీ ఆరోపణకు అనర్హం.. అన్నట్టే చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. తాజాగా చంద్రబాబు, ‘పాండోరా’ ఆరోపణల్ని వైఎస్ జగన్ మీద చేసేశారు.

అసలు పాండోరా పేపర్స్ వ్యవహారమేంటి.? అందులో వాస్తవం ఎంత.? అన్న అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కేంద్రం కూడా స్పందించింది. ఎవరెవరి పేర్లు అందులో వున్నాయన్న విషయమై ఆరా తీస్తోంది. మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

సందట్లో సడేమియా.. అన్నట్టు చంద్రబాబు చిత్రంగా వైఎస్ జగన్ పేరు తెరపైకి తెచ్చేశారు. ‘పాండోరా పేపర్స్’లో వైఎస్ జగన్ పేరు వుండే వుంటుందన్నది చంద్రబాబు జోస్యం. వైఎస్ జగన్ పేరు ఏం ఖర్మ, ఎవరి పేరైనా వుండొచ్చు. లేదా లేకపోవచ్చు. చంద్రబాబెలా జోస్యం చెబుతారు.?

చంద్రబాబు ఏమన్నా ఆ పేపర్స్‌లోకి తొంగి చూశారా.? లేదంటే, చంద్రబాబే వాటిని తయారు చేశారా.? ఏంటో చంద్రబాబు రాజకీయం. వయసు మీద పడుతున్న కొద్దీ, చంద్రబాబు రాజకీయ ఆలోచనలు అత్యంత అధమ స్థాయికి దిగజారిపోతున్నాయి. ఇలాంటి పేపర్లు, లీకులు గతంలో చాలానే వచ్చాయి.. భవిష్యత్తులో కూడా వస్తాయ్.

‘మేం అధికారంలోకి వస్తే, వైఎస్ జగన్ దోచేసిన సొమ్ముల్ని ప్రభుత్వ ఖజానాకి చేరుస్తాం..’ అని 2014 ఎన్నికలకు ముందు హంగామా చేసిన చంద్రబాబు, ఐదేళ్ళలో ఏం చేశారు.? చంద్రబాబు చెప్పే మాటలకీ, చేసే చేతలకీ అస్సలు పొంతన వుండదు. దటీజ్ చంద్రబాబు.