తెలంగాణ: హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం కోసం పాదయాత్ర చేస్తున్న ఈటెల రాజేందర్ ఒక ఆసక్తికర విషయం బయటపెట్టారు. తనను చంపేందుకు కుట్ర జరిగిందని, ఓ మంత్రి ఇలా చేశారంటూ బాంబు పేల్చారు. అయితే ఇప్పుడు అలాంటి ఆరోపణే ఈటెల ఎదుర్కొనటం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణాలో గత కొన్ని రోజులుగా హైలైట్ అవుతున్న టీపీసీసీ మాజీ నాయకుడు పాడి కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నుండి తెరాసలోకి జంప్ అయ్యేందుకు రెడీగా ఉన్న కౌశిక్ రెడ్డి ఈ రోజు తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా మాట్లాడిన కౌశిక్… “కేసీఆర్ సమక్షంలో రేపు తెరాసలో జాయిన్ అవుతున్నానని వెల్లడించారు. సన్నిహితుల, మద్దతుదారులతో సంప్రదించి అధికార పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా పేర్కొన్నారు. రాష్ట్రానికి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి తెరాసలో చేరడానికి కారణమని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని ఈటల రాజేందర్ దుర్వినియోగం చేశారని, నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. తనకు తాను అభివృద్ధి చెందేందుకు నియోజకవర్గ ప్రజలను మోసం చేశారని కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. “మాజీ ఎంపీటీసీ బలరాజ్ను 2014 లో ఈటెల హత్య చేయించారని… 2018 లో మర్రిపల్లిగూడ గ్రామంలో తనని కూడా ఈటెల చంపించే ప్రయత్నం చేశారని సంచలన ఆరోపణలు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిని ఈటెల ఎందుకు చంపబోయారని తెలంగాణ అంతటా చర్చ నడుస్తుంది.