ఆక్సిజన్ కొరతతో దేశంలో ఎవరూ చనిపోలేదా.? నిజమేనా.?

కరోనా పాండమిక్ వచ్చాక.. అతి పెద్ద సమస్య ఏంటంటే, ఆక్సిజన్ లభ్యత. కరోనా బాధితుడికి మందులు వాడటం ఎంత ముఖ్యమో, ఆక్సిజన్ అందించడం కూడా అంతే ముఖ్యమని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ప్రధానంగా శ్వాస సమస్య కరోనా కారణంగా తలెత్తడం వల్లే ఈ వైరస్ తీవ్రత కారణంగా ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకున్నాక కూడా కొంతమందికి కొంత కాలం పాటు ఆక్సిజన్ అవసరమైంది. ఢిల్లీలో అయితే, సొంత వాహనాల పక్కన ఆక్సిజన్ సిలెండర్లను పెట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కోసం వాస్తవ ధర కంటే పది రెట్లు, యాభై రెట్లు, వంద రెట్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది కరోనా బాధితుల కుటుంబాలు. ఈ క్రమంలో చాలామంది అంత ఖర్చు భరించలేక ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ కళ్ళ ముందు కనిపించినవే. కానీ, కేంద్రం మాత్రం ఆక్సిజన్ కొరత కారణంగా ఎవరూ చనిపోలేదని ఆ మధ్య ప్రకటించింది.

రాష్ట్రాలేవీ అందుకు తగ్గ సమాచారం తమకు పంపలేదని పేర్కొంది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలోని తిరుపతి రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ సమస్య తలెత్తి 10 మందికి పైగా ప్రాణాలు కోల్పోతే, ఇక్కడా మృతుల లెక్కపై గందరగోళం తలెత్తింది. చివరికి రాష్ట్ర ప్రభుత్వం 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు ఒప్పుకోవాల్సి వచ్చింది.. ఆక్సిజన్ సమస్య వల్ల వారంతా ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తూ, ఆక్సిజన్ సరఫరా చేయాల్సిన సంస్థ మీద కేసులు కూడా పెట్టింది. దేశంలో ప్రజారోగ్యం పట్ల పాలకుల్లో బాధ్యతారాహిత్యానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? 130 కోట్ల మంది ప్రజలున్న దేశంలో ఆక్సిజన్ సమస్య తలెత్తడం అనేది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ప్రభుత్వాలు శక్తివంచన లేకుండా కృషి చేసినా సమస్య వస్తుంది. కానీ, ఆ సమస్యే లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పడమే అభ్యంతరకరం. మూడో వేవ్ వస్తోంది. సర్వసన్నద్ధంగా వున్నామని కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలూ చెబుతున్నాయి. ఆ వేవ్ రాకూడదనే కోరుకుందాం. వస్తే మాత్రం, వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. ఆ తర్వాత కూడా, అబ్బే, ఆక్సిజన్ సమస్యతో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదనే ప్రభుత్వాలు చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.