పంచాయితీ ఎన్నికల్లో బాబుకు సున్నం పూసిన ఆ ఇద్దరు ఎంపీలు

cbn

 ఆంధ్రప్రదేశ్ పంచాయితీ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల కంటే ఎక్కువ స్థాయిలో జరుగుతున్నాయనే చెప్పుకోవాలి. గ్రామాల్లో జరిగే ఈ ఎన్నికలకు రాజకీయ పార్టీల గుర్తులు లేకపోయినా కానీ, ఆయా పార్టీలు అన్ని చోట్ల తమ అభ్యర్థులు గెలిచారు, ఇన్ని చోట్ల గెలిచారు అంటూ ప్రెస్ మీట్ లు పెట్టి మరి ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి రాజకీయాలు గ్రామాల అభివృద్ధికి అవరోధంగా మారుతాయనే ఉద్దేశ్యంతో ఈ పార్టీల గోల లేకుండా ఎప్పుడో చట్ట సవరణ చేశారు , కానీ వాటికీ విలువ లేకుండా అన్ని రాజకీయ పార్టీలు తమకు నచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నాయి.

galla jayadev and kesineni nani

 ముఖ్యంగా టీడీపీ పార్టీ ఈ ఎన్నికలను గట్టిగానే తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సాధ్యమైన చోట్ల పార్టీ సానుభూతి పరులను గెలిపించాలని స్థానిక నేతలకు గట్టిగానే ఆదేశాలు జారీచేశారు . కొందరు నేతలు బాబు ఆదేశాల మేరకు కష్టపడి పార్టీ కోసం పనిచేస్తే, మరి కొందరు నేతలు మాత్రం చంద్రబాబు మాటలను అసలు పట్టించుకున్న పాపాన పోలేదనే చెప్పాలి. ముఖ్యంగా పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీ లు అసలు ఈ పంచాయితీ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు సొంత పార్టీ నేతలే చెపుతున్నారు.

 ప్రస్తుతం టీడీపీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. వీరిలో ఇద్దరు కీల‌క‌మైన రెండు జిల్లాల్లో ఉన్నారు. విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని, గుంటూరు ఎంపీ గ‌ల్లా జ‌య‌దేవ్‌. వీరిరువురూ ఇప్పుడు సెంట‌ర్ ఆఫ్‌ న్యూస్‌గా మారారు. వీరిద్దరికీ కూడా పంచాయ‌తీ ఎన్నిక‌ల‌పై ఆస‌క్తి లేద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. నిజానికి వీరు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న జిల్లాల్లో పార్టీ మెజారిటీ గ్రామాల్లో ఏక‌గీవ్రాలు సాధించే అవ‌కాశం ఉంది. కానీ.. ఆ దిశగా కృషి చేయడం లేదని సీనియర్లు మండిపడుతున్నారు.

 అమరావతి రాజధాని మార్పు విషయంలో విజయవాడ, గుంటూరు పరిసర గ్రామాల్లో వైసీపీ మీద గట్టిగానే వ్యతిరేకత నెలకొని ఉంది. కాబట్టి ఈ ఇద్దరు నేతలు ఆయా గ్రామాల మీద దృష్టి పెట్టి ఉంటే కచ్చితంగా టీడీపీ కి అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం మెండుగా ఉంది. అలాంటి టైంలో ఈ రెండు జిల్లాల్లో ఉన్న ఈ ఎంపీలు ఇద్దరూ కూడా ఎవ‌రికి వారుగా ఉండ‌డం, ఎవ‌రి వ్యూహాలు వారికి ఉండ‌డంతో పార్టీ ప‌రిస్థితి ఇబ్బందిగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా.. వీరి నుంచి సహకారం లేదని సమాచారం.

ఒక పక్క గల్లా జయదేవ్ నేను చెప్పిందే అందరు వినాలని, నా మాటకు తిరుగే లేదన్నట్లు వ్యవహరించటంతో స్థానిక నేతలకు ఆయనకు మధ్య చాలానే గ్యాప్ వచ్చింది. మరో ఎంపీ కేశినేని నాని సైతం నాకెందుకు వ‌చ్చింది! అనే ధోర‌ణిని ప్రద‌ర్శిస్తున్నారట. అసలు పార్టీ అధినేత‌కు కూడా ఆయ‌న అంద‌డం లేదు. దీంతో ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నే వ్యాఖ్యలు వ‌స్తున్నాయి. ఈ ఇద్దరు బాబుకు అనుకూలంగా వ్యవహరించి ఉంటె పంచాయితీ ఎన్నికల్లో టీడీపీ పరిస్థితి మరికొంచం బాగుండేదని టీడీపీ సీనియర్ నేతలు వాపోతున్నారు