కొత్త సర్వే: జనసేన పార్టీకి 17 సీట్లు.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సర్వేల సందడి కనిపిస్తోంది వచ్చే ఎన్నికలకు సంబంధించి. వచ్చే ఎన్నికలంటే 2024లో జరగాలి. కానీ, ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఆయా పార్టీల బలాబలాలెన్ని.? అన్నదానిపై నిర్వహించిన ఓ సర్వేలో, ఆసక్తికరమైన ఫలితాలు వెలుగు చూశాయట. వాటి ప్రకారం చూస్తే, జనసేన పార్టీకి 17 నుంచి 21 వరకు అసెంబ్లీ సీట్లు రాబోతున్నాయట. ఒకటి లేదా రెండు ఎంపీ సీట్లు సైతం జనసేన గెలుచుకునే అవకాశాలున్నాయట.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 72 నుంచి 77 సీట్లలో విక్టరీ నమోదు చేయనుందన్నది సదరు సర్వే సారాంశం. మరోపక్క, తెలుగుదేశం పార్టీ 60 నుంచి 62 సీట్లు గెలుచుకునే అవకాశాలున్నాయట. భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఓ ఎమ్మెల్యే సీటు వుంటుందని, అది కూడా బీజేపీతో పొత్తు వల్లనేనని సదరు నివేదిక చెబుతోంది.

ఇదిలా వుంటే, 18 నుంచి 21 నియోజకవర్గాల్లో గట్టి పోటీ వుండబోతోందన్నది ఈ సర్వే సారాంశం. ఇక్కడే ఎవరు అధికారంలోకి వస్తారన్నది ముడిపడి వుంటుందట. అయితే, ఈ సర్వేని అధికార వైసీపీ కొట్టి పారేస్తోంది. తమ లెక్క 75 కాదు.. 175 అంటోంది. టీడీపీ, జనసేన, బీజేపీ.. అంతా కలిసి గుండు సున్నా కొట్టేస్తారన్నది వైసీపీ వాదన.

మరోపక్క, రాష్ట్రంలో జనసేన ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. వివిధ రాజకీయ పార్టీలు నిర్వహిస్తోన్న సర్వేల్లో జనసేన పార్టీ బలం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జనసేనతో పొత్తు కోసం టీడీపీ వెంపర్లాడుతోంటే, టీడీపీ – జనసేన కలవకూడదని వైసీపీ కోరుకుంటోంది.

ఏదిఏమైనా, ఈ సర్వేల ఫలితాల్ని పూర్తిగా నమ్మడానికి వీల్లేదు. కాకపోతే, ఆయా రాజకీయ పార్టీలు తమ తమ బలాల్నీ, బలహీనతల్నీ అంచనా వేసుకోవడానికి ఈ సర్వేలు ఉపయోగపడతాయి.