రాజన్న యాదిలో.! వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి.!

వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వున్నంతకాలం ఆయన పేరు తరచూ వినిపిస్తూనే వుంటుంది. ఆయన ఇప్పుడు జీవించి లేకపోయినా, వేలాది లక్షలాది హృదయాల్లో ఆయనకు ఓ గుడి కట్టబడి వుందన్నది నిర్వివాదాంశం. ఎందరో మహానుభావులు.. ఆ మహానుభావుల జాబితాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు కూడా ఖచ్చితంగా వుంటుంది.

ఔను, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. జన హృదయాల్ని కదిలించిన డాక్టర్.! వృత్తి రీత్యా వైద్యుడు.. అందుకే, పేదలకు దూరమవుతున్న వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చాడు. సమాజానికి పట్టిన రోగం తగ్గాలంటే.. నాణ్యమైన విద్య అవసరమనీ భావించారు.

రోడ్డు ప్రమాదాల్లో సరైన వైద్య సహాయం అందక ప్రాణాలు కోల్పోతున్నవారి కోసం 108 అంబులెన్స్ సేవల్ని అందుబాటులోకి తెచ్చారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీ-ఎంబర్స్మెంట్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. ఎన్నెన్నో.! ఇందిరమ్మ ఇళ్ళు కావొచ్చు, జలయజ్ణం కావొచ్చు.. దేన్ని తెరపైకి తెచ్చినా, దాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగానే పూర్తి చేయాలనుకున్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి.

రాజకీయ ప్రత్యర్థులతోనూ, ‘శభాష్ రాజన్నా..’ అనిపించుకున్న ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. రాజకీయాలన్నాక అవినీతి మకిలి అంటకపోవడం అనేది అసాద్యం. ఆ సంగతి పక్కన పెడితే, రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి ఏళ్ళు గడుస్తున్నా.. ఇంకా రాజన్న పేరు చెప్పగానే జనం పెదాలపై ఓ చిన్నపాటి చిరునవ్వు.. గుండెలో భావోద్వేగం ఉప్పొంగుతాయ్.

ఏనాడూ ఏ సంక్షేమ పథకానికీ సొంత పేరు పెట్టుకోని ఘనత రాజశేఖర్ రెడ్డిది. అందుకే, ఆయన వన్ అండ్ ఓన్లీ రాజశేఖర్ రెడ్డి అయ్యారు.