బంగారు తెలంగాణ కాదు, అప్పుల తెలంగాణ.! ఇరకాటంలో కేసీయార్.!

మూడు లక్షల కోట్ల అప్పుంది తెలంగాణ రాష్ట్రానికి. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్వాకమంటూ విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయాక, తెలంగాణ ధనిక రాష్ట్రంగా అవతరించింది. పదే పదే కేసీయార్, తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రమని చెబుతూ వస్తుంటారు. ఇప్పటికీ గులాబీ పార్టీది అదే మాట.

ధనిక రాష్ట్రం అప్పులు ఎందుకు చేసింది.? తెలంగాణ ప్రజల్ని అప్పుల కూపంలోకి ఎందుకు నెట్టేస్తున్నట్టు.? ఈ విషయమై విపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సమాధానం చెప్పలేకపోతోంది.

బంగారు తెలంగాణ అంటే ఇది కాదనీ, బంగారు తెలంగాణ పేరుతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారనీ కేసీయార్ మీద బీజేపీతోపాటు కాంగ్రెస్ కూడా విరుచుకుపడుతుండడం గమనార్హం. గత కొంతకాలంగా ఈ ఆరోపణలు వినిపిస్తున్నా, ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పార్లమెంటు వేదికగా ఆయా రాష్ట్రాల అప్పుల వివరాల్ని వెల్లడించడంతో.. కేసీయార్ సర్కారు సహా దేశంలోని చాలా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు రాజకీయ తలనొప్పుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది.

రాష్ట్రాల అప్పులు సరే, కేంద్రం మాటేమిటి.? రాష్ట్రాలకు కేంద్రం సకాలంలో ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడంలేదు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో కోత పడింది.

అయినా, కేంద్రం ఎందుకు అప్పులు చేస్తోంది.? అంటూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎదురుదాడికి దిగుతోంది.

ఈ ఎదురుదాడి సంగతి పక్కన పెడితే, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికి పరిస్థితులు అంత అనుకూలంగా వుండకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న ప్రస్తుత తరుణంలో అప్పలు తెలంగాణ వ్యవహారం కాస్తా, గులాబీ పార్టీని మరింతగా ముంచేసేలానే వుంది.