మాజీ మంత్రి ఈటెల రాజేందర్ త్వరలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారట. ఇందుకోసం జూన్ 2వ తేదీని ముహూర్తంగా ఎంచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోపక్క ఈటెల రాజేందర్ మీద సస్పెన్షన్ వేటు వేసేందుకు మాత్రం అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సాహసించలేకపోతోంది. ఈటెల భూ ఆక్రమణలకు పాల్పడ్డారని సాక్సాత్తూ తెలంగాణలోని అధికార పార్టీనే చెబుతోంది. ఆ కారణంతోనే ఆయన్ని మంత్రి వర్గం నుంచి తొలగించారు.
మరి, పార్టీ నుంచి ఎందుకు తొలగించడంలేదు.? అధికార పార్టీ నుంచి ఈటెలను తొలగించడంలేదంటే, అధికార పార్టలోని ముఖ్య నేతలకు ఈటెల భూ కబ్జాలతో లింకులున్నాయనే భావించాలేమో.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. దాంతో, ఈటెల రాజేందర్ మీద అతి త్వరలో సస్పెన్షన్ వేటు (పార్టీ పరంగా) తప్పకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. అధికార పార్టీ ఆ నిర్ణయం తీసుకునేలోపు ఈటెల, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటున్నారన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతోన్న సమాచారం.
ఈటెలతో సంబంధం వున్న కొందరు నేతల్ని తమ దారిలోకి తెచ్చుకునే క్రమంలో వారి అవినీతిని పైకి కనబడనీయకుండా చేసే క్రమంలో అధికార పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి. ‘ఈటెల అవినీతిపరుడైతే ఆయన మీద ఇప్పటికే పార్టీ పరంగా మీరు వేటు వేసి వుండాలి కదా..’ అంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించడం గమనార్హం.
ఈ ప్రశ్నలో అర్థం వుంది. కానీ, సమాధానం చెప్పాల్సిందెవరు.? ఇంకెవరు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. ఈటెలపై అవినీతి ఆరోపణలు రాగానే, విచారణకు ఆదేశించి మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆ వెంటనే ఈటెల మీద పార్టీ అధినేత హోదాలో కేసీఆర్ చర్యలు తీసుకోవాలి కదా.? అలా తీసుకోకపోవడం ఇప్పుడు గులాబీ పార్టీకి ముల్లులా గుచ్చేసుకుంటోందన్నమాట.