పార్టీ అయిపోయింది.. గ్లాసులు ఖాళీ అయ్యాయి.. తర్వాత రోజు ఉదయం మొదలైంది.. కానీ మద్యం ప్రభావం మాత్రం అక్కడితో ఆగిపోదు. చాలా మందికి తెలియని నిజం ఏంటంటే.. ఆల్కహాల్ కొన్ని గంటలు కాదు, కొన్ని రోజుల పాటు కాదు.. మన శరీరంలో చాలా కాలం పాటు తన జాడలను వదిలిపెడుతుంది. ముందురోజు రాత్రి తాగిన మద్యం, తర్వాతి రోజు మాత్రమే కాదు.. నెలల పాటు శరీరాన్ని ప్రభావితం చేస్తుందన్న విషయం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ రోజుల్లో పార్టీల్లో మద్యం సేవించడం సాధారణ అలవాటుగా మారిపోయింది. కొందరికి ఫ్రీగా దొరుకుతుందని తాగితే, మరికొందరు హ్యాపీ మూడ్ కోసం తాగుతారు. కానీ రాత్రి తాగిన తర్వాత వచ్చే హ్యాంగోవర్ మాత్రం మరుసటి రోజు ఉదయం వరకు వెంటాడుతుంది. అసలు ఆ హ్యాంగోవర్ ఎందుకు వస్తుంది? ఆల్కహాల్ మన శరీరంలో ఎంతకాలం ఉంటుంది? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటే నిజంగా షాక్ అవ్వాల్సిందే.
మనం మద్యం తాగిన వెంటనే అది జీర్ణం అయిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ వాస్తవం అలా కాదు. ఆల్కహాల్‌లో సుమారు 20 శాతం కడుపులోనే ఉండిపోతుంది. మిగిలిన 80 శాతం చిన్న ప్రేగుల ద్వారా నేరుగా రక్తంలోకి చేరుతుంది. అక్కడి నుంచి అది శరీరం మొత్తం ప్రయాణించి, చివరకు కాలేయానికి చేరుతుంది. ఆల్కహాల్‌ను విచ్ఛిన్నం చేసే ప్రధాన బాధ్యత మొత్తం కాలేయంపైనే ఉంటుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మద్యం ప్రభావాన్ని తట్టుకోగలం.
సాధారణంగా ఒక ఆరోగ్యవంతమైన కాలేయం గంటకు ఒక సాధారణ పానీయాన్ని మాత్రమే ప్రాసెస్ చేయగలదు. అంతకంటే ఎక్కువ మద్యం తీసుకుంటే, అది శరీరంలో పేరుకుపోతూ వివిధ అవయవాలపై ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ రక్తంలో దాదాపు 6 నుంచి 12 గంటల వరకు ఉంటుంది. దీనిని రక్త ఆల్కహాల్ సాంద్రత (BAC) ద్వారా కొలుస్తారు. అందుకే తాగిన చాలా గంటల తర్వాత కూడా డ్రైవింగ్ చేయడం ప్రమాదకరం అవుతుంది.
శ్వాసలో ఆల్కహాల్ జాడలు 12 నుంచి 24 గంటల వరకు గుర్తించవచ్చు. మూత్రంలో అయితే సాధారణంగా 12 నుంచి 48 గంటల వరకు ఆల్కహాల్ ఆనవాళ్లు ఉంటాయి. అధునాతన పరీక్షలలో ఇది 80 గంటల వరకు కూడా బయటపడుతుంది. లాలాజలంలో ఆల్కహాల్ 12 నుంచి 48 గంటల వరకు ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇక్కడితో కథ ముగియదు.. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆల్కహాల్ జాడలు మన వెంట్రుకల కుదుళ్లలో దాదాపు 90 రోజులు అంటే మూడు నెలల వరకు ఉండగలవట.
పురుషులతో పోలిస్తే మహిళల శరీరంలో నీటి శాతం తక్కువగా, కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మహిళల శరీరంలో ఆల్కహాల్ ఎక్కువసేపు నిలిచిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. వయసు పెరిగే కొద్దీ కాలేయం పని చేసే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే వృద్ధుల్లో మద్యం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఖాళీ కడుపుతో మద్యం తాగితే, అది చాలా వేగంగా రక్తంలోకి చేరుతుంది. అదే సమయంలో కొన్ని మందులు తీసుకుంటుంటే, కాలేయంపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఫలితంగా ఆల్కహాల్ శరీరం నుంచి బయటకు వెళ్లడానికి మరింత సమయం పడుతుంది.
మద్యం తాగిన తర్వాత చాలామంది బ్లాక్ కాఫీ తాగడం, చల్లటి నీటితో స్నానం చేయడం లాంటి మార్గాలు ప్రయత్నిస్తారు. కానీ ఇవేవీ రక్తంలోని ఆల్కహాల్ మొత్తాన్ని తగ్గించలేవు. కాలేయం పనిచేసే వేగాన్ని కూడా పెంచలేవు. మద్యం ప్రభావం తగ్గడానికి ఉన్న ఏకైక మార్గం.. శరీరానికి తగినంత సమయం ఇవ్వడమే. మొత్తంగా చూస్తే, ఒక రాత్రి మజాగా తాగిన మద్యం ప్రభావం కొన్ని గంటలకే ముగిసిపోదు. అది మన శరీరంలో నిశ్శబ్దంగా ప్రయాణిస్తూ, రోజులు.. వారాలు.. కొన్నిసార్లు నెలల వరకూ తన ఉనికిని చాటుతుంది. అందుకే మద్యం విషయంలో జాగ్రత్త అవసరం.
