ఎంత దారుణంగా ఓడిపోయినా ఏపీలో ప్రధాన ప్రతిపక్షం అంటే తెలుగుదేశం పార్టీనే. ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద సంఖ్యలో లేకపోవచ్చుకానీ టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. కానీ అది నిస్తేజంగా ఉంది. పరాజయంతో పడుకుండిపోయిన పార్టీ శ్రేణుల్లో తిరిగి ఉత్సాహం నింపాలి. అది చేయవలసింది అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడుగారి పని. కానీ అయన ఆ పని చేస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. వేరొకరు చెప్పడమేమిటి స్వయంగా టీడీపీ శ్రేణులే ఆ మాట అంటున్నారు. గతంలో ఎన్నడూ లేనంత బలహీనంగా ఉన్నారు బాబు. వయోభారమో, భవిష్యత్తు మీద నమ్మకంలేకపోవడమో తెలీదు కానీ సొంత ఆలోచనలతో పార్టీని పరుగులు పెట్టించలేకపోతున్నారు.
అసలు ప్రస్తుతం టీడీపీ ప్రవర్తిస్తున్న తీరు ఆ పార్టీ సొంత తీరే కాదు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకుడు అధికార పక్షంలో ఉన్నా చంద్రబాబు నాయుడు బెదిరింది లేదు. ధీటుగా ఆయన్ను ఎదుర్కుంటూ పార్టీ ఉనికిని చాటుకున్నావారు. కానీ ఇప్పుడు పాలక పక్షానికి కనీస స్థాయిలో కూడ పోటీ ఇవ్వలేకపోతున్నారు. ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం గడిచిపోయింది. ఇప్పటివరకూ ప్రతిపక్షంగా టీడీపీ సాధించిన ప్రగతి సున్నా. మరి ఈ వెనుకబాటుతననైకి కారణం ఏమిటి అంటే అది నూటికి నూరుపాళ్లు చంద్రబాబుగారి ఆలోచనల్లో నాణ్యత లేకపోవడమే. సొంతగా ఒక స్టాండ్ తీసుకొని పాలకవర్గం మీద ఒత్తిడి పెంచడంలో ఆయన విఫలమయ్యారు.
ఎంతసేపూ పక్క పార్టీల వెనక పడటం, అవి ఏది మాట్లాడితే దాన్నే అందుకుని అదే బాటలో వెళుతున్నారు. రాష్ట్రంలో బీజేపీ స్నేహం కోసం బాబుగారు తహతహలాడిపోతున్నారు. అనవసరంగా వారికి హైప్ ఇస్తున్నారు. వాళ్ళేదో తమ ప్రాథమిక శైలిలో దేవుడి, హిందూత్వం, క్రిస్టియానిటీ అంటూ మత రాజకీయాలు చేసుకుంటూ అధికార పీఠాన్ని వెంట్రుకతో లాగాలని చూస్తున్నారు. ఇంకో పదేళ్లు గడిచినా వారి ప్రయత్నాలు ఫలించవని అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు కూడ బీజేపీ వైఖరిని దత్తతు తీసుకుని మతం పేరుతో వైసీపీని ఢీకొట్టాలని చూస్తున్నారు.
దీన్ని గమనిస్తున్న తమ్ముళ్లు ఇలాంటి ఈ మత పోరాటాలతో ఏం సాధిస్తాం. అసలు మన స్థాయి ఇది కాదు. వాళ్లెవరో మొదలుపెట్టిన పోరాటాన్ని మనం భుజానికెత్తుకోవాదం ఏమిటి. పాలకవర్గాన్ని ఎదిరించడానికి మనకంటూ బలమైన కారణాలు ఉండాలి. ఇలాగే చేస్తూ పోతే చివరికి తోక పార్టీలా మిగిలిపోతాం అంటున్నారు. వాళ్ళ అభిప్రాయం చాలా కరెక్ట్. బీజేపీ చేస్తున్న తరహాలో ప్రభుత్వం మీద పోరాడాలి అనుకుంటే చివరికి ఏమీ మిగలదు. అంటే కనీసం కార్యకర్తలు ఆలోచిస్తున్న స్థాయిలో కూడ చంద్రబాబుగారు ఆలోచించలేకపోతున్నారన్నమాట.