కేసీయార్‌తో విజయ్ భేటీ వెనుక నిజంగానే రాజకీయం లేదా.?

ప్రముఖ తమిళ నటుడు విజయ్ రాజకీయాల్లోకి వస్తారన్న ప్రచారం ఈనాటిది కాదు. అజిత్, రజనీకాంత్, విజయ్, కమల్ హాసన్, విజయ్ కాంత్.. ఇలా తమిళ సినీ స్టార్లకి రాజకీయాలపై వున్న ఆసక్తి ఎక్కువే. రాజకీయాలంటే భయపడ్డాడు రజనీకాంత్. అజయ్, రాజకీయాలంటే అంటీముట్టనట్టు వ్యవహరిస్తాడుగానీ, ఆయనకు రాజకీయ పరిచయాలు తక్కువేమీ కాదు. కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చేశాడు. రాణించలేకపోతున్నాడు కూడా.!

మిగిలింది విజయ్.! అతి త్వరలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. కొత్త రాజకీయ పార్టీ పెడతారంటూ ఊహాగానాలు వినిపిస్తున్న వేళ, అనూహ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో హైద్రాబాద్‌లో విజయ్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

జాతీయ స్థాయి రాజకీయాల్లో కొత్త రాజకీయ వేదికను స్థాపించాని కేసీయార్ యోచిస్తోన్న సంగతి తెలిసిందే. బీజేపీ, కాంగ్రస్ యేతర శక్తిగా తన రాజకీయ వేదికను మార్చాలన్నది కేసీయార్ వ్యూహం. ఈ క్రమంలోనే కేసీయార్, విజయ్‌ని పిలిపించుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, రాజకీయ చర్చలేమీ జరగలేదనీ, ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని ఇరు వర్గాల నుంచి సమాచారం అందుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రముఖులతో రాజకీయాలు చర్చించకుండా, తమిళ సూపర్ స్టార్స్‌తో కేసీయార్ ఎందుకు రాజకీయాలు చర్చిస్తారన్న వాదన కూడా లేకపోలేదు. ఖచ్చితంగా, ఇరువురి మధ్యా రాజకీయ అంశాలు చర్చకు వచ్చే వుంటాయి. కానీ, ఆ వివరాల్ని అధికారికంగా వెల్లడించరు కదా.?

తమిళనాడులో అధికార పార్టీ డీఎంకేతో తెలంగాణ రాష్ట్ర సమితికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ లెక్కన కొత్తగా విజయ్‌తో సంబంధాల్ని తెలంగాణ రాష్ట్ర సమితి కోరుకోవాల్సిన అవసరమేముందో.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.

కాగా, కేవలం సినిమా సంబంధిత అంశాలపై మర్యాదపూర్వక భేటీలో చర్చ జరిగి వుంటుందని కేసీయార్‌తో విజయ్ భేటీపై విజయ్ సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది.