మాస్కుల్లేకపోతే జరీమానా.. గులాబీ కండువా వుంటే ‘నో’.!

No Mask! No Fine For Pink Karyakarthas?

No Mask! No Fine For Pink Karyakarthas?

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం హోరెత్తుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో అధికార పార్టీ గెలుపే లక్ష్యంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభ కోసం పెద్దయెత్తున జనాన్ని తరలిస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించిన బహిరంగ సభ అంటే.. హంగామా ఏ స్థాయిలో వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సంప్రదాయ డాన్సులు వంటి హంగామాలు చాలానే వున్నాయి. కానీ, ఎవరికీ మాస్కులు కనిపించడంలేదు. ఇదెక్కడి చోద్యం.? అంటే, అదంతే. మామూలుగా అయితే, కరోనా తీవ్రత పెరిగిన నేపథ్యంలో మాస్క్ ధరించకపోతే జరీమానా.. అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

కఠినంగా ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని ప్రభుత్వమూ అధికార యంత్రాంగానికి స్పష్టం చేసింది. కానీ, ఆదేశాలు జారీ చేసే అధికార పార్టీనే.. ఉల్లంఘనలకు పాల్పడితే ఎలా.? ‘నో మాస్క్.. నో ఎంట్రీ..’ అంటూ గులాబీ పార్టీ పైకి బాగానే ప్రచారం చేస్తోంది. కోవిడ్ భద్రతా చర్యలు పక్కగా పాటిస్తున్నామనీ అంటోంది. చెప్పే మాటలకీ, చేసే చేతలకీ అస్సలు పొందన కనిపించడంలేదు. తాగినోడికి తగినంత.. దొర్లినోడికి దొర్లినంత.. అన్నట్టు తయారైంది పరిస్థితి. ఒక్క టీఆర్ఎస్ విషయంలోనే ఇలా జరుగుతోందని అనుకోవడానికి వీల్లేదు. అన్ని పార్టీలూ చేస్తున్నది అదే. తిరుపతి ఉప ఎన్నికలోనూ, దేశంలో జరుగుతున్న వివిధ రాష్ట్రాల్లోని ఎన్నికల్లోనూ ఇదే తరహా ఉల్లంఘనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతలా రాజకీయ పార్టీలు కరోనా మహమ్మారిని పెంచి పోషిస్తోంటే, దేశమ్మీద కరోనా వైరస్ దండెత్తకుండా ఎలా వుంటుంది.?